ఆర్ఎల్సీ అంగీకరించిన 24 డిమాండ్లు అమలు చేయాలి
లేకుంటే మెరుపు సమ్మె తప్పదు
శ్రావణపల్లి, కోయగూడెం ఓసీ-3 సింగరేణికే కేటాయించాలి
కొరిమి రాజ్‌కుమార్ హెచ్చరిక
టేకులపల్లి,(విజయక్రాంతి): ఆర్ఎల్సీ (Regional Labor Commissioner) సమక్షంలో సింగరేణి యాజమాన్యం అంగీకరించిన 24 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (Singareni Workers Union) ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. కోయగూడెం ఓసీపీలో ఫిట్ కార్యదర్శి మాలోత్ హరిసింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సమస్యల(Singareni Labour Issues) పరిష్కారంపై యాజమాన్యం కాలయాపన చేస్తోందని, అంగీకరించిన డిమాండ్లపై ఇప్పటివరకు సర్క్యులర్లు విడుదల చేయలేదని విమర్శించారు.
24 డిమాండ్లపై వెంటనే సర్క్యులర్లు జారీ చేయాలని, మెడికల్ ఫిట్ అయిన ఉద్యోగులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని, పాత పద్ధతిలో మెడికల్ బోర్డులు నిర్వహించాలని కోరారు. జెన్కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన రూ.60 వేల కోట్ల బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రావణపల్లి, కోయగూడెం ఓసీ-3 టెండర్లలో సింగరేణికే ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ఈ నెల 18, 19 తేదీల్లో అన్ని జీఎం కార్యాలయాల ఎదుట రెండు రోజుల నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే మెరుపు సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె. సారయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్, సహాయ కార్యదర్శి కొంగర వెంకటేశ్వర్లు, షేక్ సర్వర్, సామల శ్రీనివాస్, జీఏ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.