దళిత బిడ్డకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం
డాక్టర్ ఆనందరావుకు బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు
జుక్కల్,(విజయక్రాంతి): వైద్య సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో గత పదేళ్లుగా విశేషంగా కృషి చేస్తున్న జుక్కల్ మండలం హంగర్గా గ్రామానికి చెందిన దళిత బిడ్డ అయినటువంటి ప్రముఖ ఈఎన్టీ వైద్యులు డాక్టర్ ఆనందరావుకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన బెస్ట్ సర్వీస్ సొసైటీ ఆయనను “బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు”కు ఎంపిక చేసింది.
ఈ నెల 15వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ ఆనందరావుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. వైద్యాన్ని కేవలం వృత్తిగా కాకుండా సేవా భావంతో కొనసాగిస్తూ, సమాజం పట్ల బాధ్యతతో పనిచేస్తున్న ఆయన సేవలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. డాక్టర్ ఆనందరావు గత పదేళ్లుగా వైద్య రంగంతో పాటు విద్య, సామాజిక సేవ, యువత ప్రోత్సాహం తదితర రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పేద కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు ఆర్థికంగా అండగా నిలుస్తూ, నిరుపేదలకు తన వంతు సహాయం అందిస్తున్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకునేలా ప్రోత్సహిస్తూ క్రీడా పోటీల్లో బహుమతులు అందజేస్తున్నారు. అంతేకాకుండా సూర్యాపేటలో అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. 12వ తరగతి వరకు చదువుకునే పేద విద్యార్థులకు ఉచిత భోజనం, హాస్టల్ వసతి వంటి సౌకర్యాలను కల్పిస్తూ విద్యాభ్యాసానికి తోడ్పడుతున్నారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు.
డాక్టర్ ఆనందరావు స్వస్థలం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్గ గ్రామం. జుక్కల్ నియోజకవర్గంలోనూ ఆయన అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, యువతకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు.
ప్రస్తుతం డాక్టర్ ఆనందరావు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఈఎన్టీ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం నుంచి ఎదిగి వైద్య రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం పట్ల హంగర్గ గ్రామస్తులు, జుక్కల్ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కష్టపడి చదువుకుని వైద్యుడిగా ఎదిగి, వృత్తితో పాటు సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేస్తున్న డాక్టర్ ఆనందరావుకు లభించిన జాతీయ అవార్డు యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు. జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు రావడం సూర్యాపేటతో పాటు జుక్కల్ నియోజకవర్గానికి, హంగర్గ గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.