ఆరు నెలలుగా సమావేశాలు లేవు
జుక్కల్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ పాలనలో వార్డు సభ్యులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ, జనరల్ బాడీ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని జుక్కల్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. గత ఆరు నెలలుగా గ్రామపంచాయతీలో జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించడం లేదని ఆరోపిస్తూ మంగళవారం ఎంపీడీవో శ్రీనివాస్‌కు వార్డు సభ్యులు విరల్, హైదర్ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజలకు సంబంధించిన పలు సమస్యలు, అభివృద్ధి పనులు, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు జనరల్ బాడీ సమావేశాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. అయితే గత ఆరు నెలలుగా సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల వార్డు సభ్యులకు తమ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు వార్డు సభ్యుల సంతకాలు తీసుకుని, సమావేశం నిర్వహించినట్లు అధికారులకు సమాచారం అందిస్తూ తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. వాస్తవంగా సమావేశాలు నిర్వహించకుండా సమావేశాలు జరిగినట్లు చూపించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
గ్రామపంచాయతీ పాలనలో వార్డు సభ్యుల భాగస్వామ్యం కీలకమని, ప్రజా సమస్యల పరిష్కారానికి సమావేశాల ద్వారా చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జుక్కల్ గ్రామపంచాయతీలో జనరల్ బాడీ సమావేశాన్ని వెంటనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.