విద్యార్థిపై దాడి చేసిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలి

17-11-2026 | 01:35pm

- మార్టిన్ గ్రామర్ స్కూల్‌పై విచారణ జరపాలి

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) నస్పూర్‌లోని మార్టిన్ గ్రామర్ హైస్కూల్‌(Martin Grammar High School)లో విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేసిన ఘటనపై బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం(BRSV Student Section) ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గుల మధుకుమార్ డిమాండ్ చేశారు.

ఘటనను ఖండిస్తూ బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని కోరుతూ ఆయన పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థికి మద్దతుగా నిలిచారు. అనంతరం నస్పూర్ మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి విద్యార్థిపై దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడితో పాటు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

పాఠశాలలు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే కేంద్రాలుగా ఉండాలే తప్ప భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించకూడదని మధుకుమార్ పేర్కొన్నారు. విద్యార్థులపై శారీరక, మానసిక వేధింపులను సహించేది లేదని స్పష్టం చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్వీ అండగా ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు