తరాలు మారినా.. తరగని కుటుంబ ప్రేమ

09-11-2026 | 05:09pm

అశ్వాపురం, నవంబర్ 9 (విజయక్రాంతి): మనుషుల మధ్య బంధాలు క్రమంగా దూరమవుతున్న నేటి కాలంలోనూ ఓ కుటుంబం 29 ఏళ్లుగా ఆత్మీయతకు, అనుబంధానికి చిరునామాగా నిలుస్తోంది. కుటుంబ పెద్ద భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలను గుండెల్లో పదిలపరుచుకుంటూ ప్రతి ఏటా వర్ధంతి రోజున కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరడం ఆ కుటుంబ ప్రత్యేకతగా మారింది.

మొండికుంటకు చెందిన నెల్లిపాక సహకార సంఘం మాజీ చైర్మన్, కీర్తిశేషులు కామ్రేడ్ కమటం రామచంద్రయ్య 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కుటుంబ సభ్యులు ఆప్యాయతతో, ఐకమత్యంతో నిర్వహించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా, ఎన్ని పనుల్లో నిమగ్నమైనా ఈ ప్రత్యేక రోజున మాత్రం అందరూ ఒక్కచోట చేరి కుటుంబ పెద్దకు నివాళులర్పించడం విశేషం.

కాలం మారింది.. తరాలు మారాయి.. కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చారు.. బాధ్యతలు పెరిగాయి.. అయినా పెద్దల జ్ఞాపకాలను స్మరించుకునే సంప్రదాయంలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. నేటి సమాజంలో చిన్నచిన్న మనస్పర్థలకే కుటుంబ బంధాలు బలహీనపడుతున్న తరుణంలో కమటం కుటుంబం 29 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఈ ఆత్మీయ సంప్రదాయం ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఇది కేవలం వర్ధంతి కార్యక్రమం మాత్రమే కాదు.. కుటుంబ పెద్దల పట్ల గౌరవం, వారి ఆశయాల పట్ల అభిమానం, రక్తసంబంధాల మధ్య ఉండాల్సిన ఆత్మీయతకు నిలువెత్తు నిదర్శనం. ఆస్తులు, అంతస్తులు కొంతకాలమే తోడుంటాయి.. కానీ ప్రేమతో పెనవేసుకున్న కుటుంబ బంధాలు తరతరాల పాటు నిలిచిపోతాయని ఈ కుటుంబం తన ఆచరణతో చాటిచెబుతోంది.

కుటుంబ పెద్ద భౌతికంగా దూరమైనా ఆయన జ్ఞాపకాలను కుటుంబ సభ్యులందరినీ కలిపే ఆత్మీయ వారధిగా మార్చుకున్న కమటం కుటుంబ ఐక్యత నేటి తరానికి గొప్ప సందేశంగా నిలుస్తోంది. మనిషి దూరమైనా జ్ఞాపకం మిగులుతుంది.. తరాలు మారినా నిజమైన కుటుంబ ప్రేమ తరగదు. ఇదే 29 ఏళ్లుగా కమటం కుటుంబం కొనసాగిస్తున్న అనుబంధపు వారసత్వం.

మరిన్ని వార్తలు