భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి
నీతి ఆయోగ్ – జైకా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ కార్యక్రమంలో భాగంగా జపాన్‌లో జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యయన పర్యటన
విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో జపాన్ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 17 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా జపాన్‌లో అమలవుతున్న అభివృద్ధి నమూనాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతమైన పరిపాలనా విధానాలను జిల్లా కలెక్టర్ అంకిత్(Collector Ankit) అధ్యయనం చేస్తున్నారు. నీతి ఆయోగ్ ,జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ(JICA) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అండ్ బ్లాక్స్ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 15 నుంచి 21 వరకు జపాన్‌లో నిర్వహిస్తున్న అధ్యయన పర్యటనలో జిల్లా కలెక్టర్ పాల్గొంటున్నారు.
ఈ పర్యటనలో భాగంగా జపాన్‌లో అమలవుతున్న ఆధునిక అభివృద్ధి విధానాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతమైన పరిపాలనా పద్ధతులు, ప్రజా సేవల నిర్వహణ, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సంస్థల పనితీరు తదితర అంశాలను పరిశీలించి అధ్యయనం చేస్తున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు జపాన్ అనుసరిస్తున్న వినూత్న విధానాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై అవగాహన పొందుతున్నారు.
జిల్లాలోని ఆస్పిరేషనల్ బ్లాక్‌తో పాటు ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని విద్య, వైద్యం, పోషకాహారం, వ్యవసాయం, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల రంగాల్లో జపాన్ అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను జిల్లాలో అమలు చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ఈ అధ్యయన పర్యటన ద్వారా పొందిన అనుభవాలు, పరిజ్ఞానం, ఉత్తమ అభివృద్ధి విధానాలను జిల్లాలోని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అన్వయించి, అభివృద్ధి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించే దిశగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనుంది.