యువరాజు విలియం, రాబర్ట్ ఇర్విన్.. ముంబైలో సందడి
ముంబై: పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న ఆలోచనలు చేస్తున్న చిన్నారులను ప్రోత్సహించేందుకు ముంబైలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మ్యూజియం ఆఫ్ సొల్యూషన్స్ (MuSo) వేదికగా మంగళవారం తొలి చిల్డ్రన్స్ ఎర్త్‌షాట్ అవార్డుల వేడుక జరిగింది. బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం(Britain Prince William), దక్షిణాఫ్రికా నటి నోమ్జామో మ్బాతా(South African actress Nomzamo Mbatha), ఆస్ట్రేలియా వన్యప్రాణుల పరిరక్షకుడు రాబర్ట్ ఇర్విన్(Robert Irwin) ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సమస్యలకు పరిష్కారాలు కనుగొనే యువతను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా నిర్వహించిన 'ఐ కెన్ ఎర్త్‌షాట్ ఛాలెంజ్' ద్వారా విద్యార్థులు తమ ప్రాంతాల్లో ఎదురవుతున్న పర్యావరణ సమస్యలను గుర్తించి, వాటికి ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించారు.
ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని 15 వేల పాఠశాలలకు విస్తరించింది. దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు. ఎంపికైన 15 విద్యార్థి బృందాలు ముంబైకి చేరుకుని తమ ఆలోచనలను, ప్రాజెక్టులను ప్రదర్శించాయి.
వాతావరణ మార్పులు, సముద్రాల పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి, వ్యర్థాల తగ్గింపు, ప్రకృతి సంరక్షణ వంటి ఐదు అంశాలపై విద్యార్థుల ఆలోచనలకు ఈ వేదిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి విభాగంలో ఎంపికైన విజేత బృందాలకు తమ పరిష్కారాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఆర్థిక ప్రోత్సాహం అందించనున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్స్ విలియంతో పాటు ప్రిన్సెస్ కేథరిన్, నటి నోమ్జామో మ్బాతా, నటుడు సిమోన్ యాష్లే, వన్యప్రాణుల పరిరక్షకుడు రాబర్ట్ ఇర్విన్ తదితరులు పాల్గొన్నారు.
ప్రిన్స్ విలియం 2020లో ప్రారంభించిన ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రపంచంలోని ప్రధాన పర్యావరణ సమస్యలకు వినూత్న పరిష్కారాలను గుర్తించి ప్రోత్సహిస్తోంది. ఈసారి తొలిసారిగా చిన్నారుల కోసం ప్రత్యేక అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. చిన్న వయసు నుంచే పర్యావరణ బాధ్యతను పెంపొందించడం, భవిష్యత్తు తరాలను పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యం.