ఓబీ కార్మికుల సమ్మెపై సింగరేణి స్పందించాలి
కొత్తగూడెం, నవంబర్ 15 (విజయక్రాంతి): కష్టపడి పనిచేసే కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా డిమాండ్ చేశారు.
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వెంకటేష్ ఖని కోల్‌మైన్ (VKCМ) ఓపెన్‌కాస్ట్‌లో ఓవర్‌బర్డెన్ (Overburden) మట్టి పనులు చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. కార్మికులకు రావాల్సిన 20 శాతం బోనస్ (20% Bonus) తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర ఓబీ కంపెనీల తరహాలో రోజుకు రూ.950 చొప్పున 26 రోజుల వేతనం, ఆదివారం డబుల్ మస్టర్ చెల్లించడంతో పాటు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని కోరారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం మొండిగా వ్యవహరించడం తగదని, సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. సమ్మెలో పాల్గొన్నారనే కారణంతో నలుగురు కార్మికులను విధుల నుంచి తొలగించడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలకు యాజమాన్యం స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు.
తక్షణమే సింగరేణి యాజమాన్యం, కార్మిక శాఖ (Labour Department) జోక్యం చేసుకుని కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల న్యాయపోరాటానికి సీపీఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, నాయకులు సలిగంటి శ్రీనివాస్, జీ. వీరస్వామి, గట్టయ్య, మార్షల్ శ్రీను, మోహన్, సత్తార్, కట్టా ఉదయ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు