స్వచ్ఛంద సేవకులకు యోగా, డ్రిల్ శిక్షణ
ఘట్కేసర్, నవంబర్ 15 (విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న పశ్చిమ మండల ఎన్ఎస్ఎస్ ప్రీ-రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపు యోగా, శారీరక వ్యాయామ శిక్షణతో ప్రారంభమైంది. ఈ శిక్షణ ద్వారా స్వచ్ఛంద సేవకుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం భారత సైన్యానికి చెందిన అనుభవజ్ఞులైన డ్రిల్ ఇన్స్ట్రక్టర్ల ఆధ్వర్యంలో పరేడ్ సాధన చేపట్టారు. ఈ శిక్షణలో కచ్చితత్వం, సమన్వయం, క్రమశిక్షణ, పరేడ్ విన్యాసాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక అతిథి సమావేశంలో పశ్చిమ మండల ఎన్ఎస్ఎస్ ప్రీ-రిపబ్లిక్ డే పరేడ్ క్యాంపు కోఆర్డినేటర్, అనురాగ్ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ సెల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ్ పాల్గొన్నారు. 'ఎన్ఎస్ఎస్లో 30 ఏళ్ల ప్రస్థానం.. స్వచ్ఛంద సేవకుడి నుంచి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వరకు' అనే అంశంపై స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.
జాతీయ సేవా పథకంతో తనకున్న మూడు దశాబ్దాల అనుబంధాన్ని వివరిస్తూ వ్యక్తిగత ప్రయాణం, అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లు, ఎన్ఎస్ఎస్లో సాధించిన అభివృద్ధి గురించి స్వచ్ఛంద సేవకులతో పంచుకున్నారు. అంకితభావం, నిబద్ధత, బృందస్ఫూర్తి, నిస్వార్థ సేవా భావం వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ లక్షణాల పెంపునకు ఎలా దోహదపడతాయో వివరించారు.