రాష్ట్రస్థాయి పదవికి జైపాల్ రెడ్డి ఎన్నిక

15-11-2026 | 07:12pm

కామారెడ్డి, నవంబర్ 15 (విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా కామారెడ్డి జిల్లాకు చెందిన డా. ఎం. జైపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ ప్రతాప్ శుక్లా ఆధ్వర్యంలో, రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ అధ్యక్షతన రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల చైర్మన్లు, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఎన్నికల ప్రక్రియ చేపట్టి రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, ఆర్కే విద్యాసంస్థల గ్రూప్ సీఈఓ డా. ఎం. జైపాల్ రెడ్డికి ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా అవకాశం లభించింది.

ఈ సందర్భంగా డా. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు రెడ్ క్రాస్ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. 'నషా ముక్త భారత్' (Nasha Mukt Bharat) కార్యక్రమంతో పాటు ఆరోగ్య సంబంధిత అవగాహన కార్యక్రమాలను సమర్థవంతమైన బృందంతో ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.

తనను ఫైనాన్స్ కమిటీ సభ్యునిగా ఎన్నుకున్న గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్, రాష్ట్ర సెక్రటరీ, సీఈఓ శ్రీరాములు, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రస్థాయి కమిటీలో స్థానం సంపాదించిన డా. జైపాల్ రెడ్డికి కామారెడ్డి జిల్లా ఐఆర్‌సీఎస్ చైర్మన్ సంజీవ్ రెడ్డి, సభ్యులు డాక్టర్ బాలు, దత్తాత్రి, ఇతర సభ్యులు, ఆర్కే గ్రూప్ అధ్యాపక బృందం, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు