మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

17-11-2026 | 05:20pm

280 బీజీఎల్ లాంచర్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్ 

చర్ల, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem district) చర్ల మండల పరిధిలోని తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూమిలో పాతిపెట్టిన డంప్ లో 280 బీజీఎల్ లాంచర్లు లభ్యమైనట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. చర్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, స్పెషల్ పార్టీ, బీడీ టీం సంయుక్తంగా సరిహద్దు అడవుల్లో గాలించగా ఈ డంప్ బయటపడింది.

2025 ప్రారంభంలో పి ఎల్ జి ఏ బెటాలియన్ వికేంద్రీకరణ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం మావోయిస్టులు ఈ బిజిఎల్ షెల్స్ ను అటవీ ప్రాంతంలో దాచి పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, మావోయిస్టులు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సరెండర్ మరియు పునరావాస పథకం ద్వారా లొంగిపోయిన వారికి నగదు బహుమానం, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి, రుణ సదుపాయం, హెల్త్ కార్డులు అందజేస్తున్నామని తెలిపారు. 2024 నుంచి ఇప్పటి వరకు 824 మంది మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం ఎదుట లొంగిపోయారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు