రైతులే నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయాలి

17-11-2026 | 05:09pm

ఫౌండేషన్ విత్తనాలతో 10 నుంచి 15 శాతం అధిక దిగుబడికి అవకాశం: శాస్త్రవేత్త డా. పల్లవి

సిద్దిపేట రూరల్, నవంబర్ 17: రైతులు నాణ్యమైన వరి విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేసుకొని ప్రైవేట్ విత్తనాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(Telangana Rythu Vignana Kendras) సిద్దిపేట కోఆర్డినేటర్, శాస్త్రవేత్త డా. సీహెచ్. పల్లవి సూచించారు. మంగళవారం నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో రైతు భూపతి రెడ్డి పొలంలో రైతు విజ్ఞాన కేంద్రం, నాబార్డ్ ఆధ్వర్యంలో వరి విత్తనోత్పత్తిపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ KNM-1638 ఫౌండేషన్ విత్తనాలను గంగాపూర్ ప్రాథమిక సహకార సంఘం ద్వారా రైతులకు అందించినట్లు, వీటి వినియోగంతో 10 నుంచి 15 శాతం వరకు దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు.

నాబార్డ్ డీడీఎం నిఖిల్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందడమే కాకుండా సహకార సంఘాలు బలోపేతం అవుతాయని తెలిపారు. ఎల్‌డీఎం హరిబాబు వ్యవసాయ రుణాలు, పథకాలు, సబ్సిడీలపై, ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ గేము నాయక్ స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ఏఓ పరశురాం రెడ్డి ఆరుతడి పంటలు, జనుము విత్తనోత్పత్తిని ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ బెజుగం సత్తయ్య, ఏఈఓ ప్రేమ్ సాయి, సీఈఓ నాగరాజు, వార్డు సభ్యులు రాజు, కిషన్, పరశురాములు, 80 మంది రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు