ఆదివాసులపై దాడులు అరికట్టాలి
తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కాపుల నాగరాజు
చర్ల, (విజయక్రాంతి): భద్రాచలం(Bhadrachalam)లో ఆదివాసి యువకుడి హత్య ఘటనను తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కాపుల నాగరాజు తీవ్రంగా ఖండించారు. చర్లలో సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గది కోసం లాడ్జికి వెళ్లిన యువకుడిని దారుణంగా కొట్టి హత్య చేయడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. నిందితులపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంబంధిత లాడ్జిని తక్షణమే సీజ్ చేయాలని, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా, లాడ్జి యాజమాన్యం నుంచి మరో రూ.50 లక్షల పరిహారం ఇప్పించాలని కోరారు. ఏజెన్సీలో అనుమతులు లేని లాడ్జిలు, అక్రమ నిర్మాణాలపై తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని, 1/70, పీసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.