బాలిక గౌరవానికి రూ. 3 లక్షలు వెల కట్టడమా...?

17-11-2026 | 05:43pm
  1. మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడి ఆరోపణలు.. ఘటనను పంచాయతీతో ముగించిన పెద్దలు... ?
  2. బాలికకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల డిమాండ్...

బాన్సువాడ, నవంబర్ 17 (విజయ క్రాంతి): బతుకుదెరువు(Livelihood) కోసం వలస వచ్చిన ఓ కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై(Minor girl) సామూహిక లైంగిక దాడి(Gang sexual assault) జరిగినట్లు ఆలస్యం గా వెలుగులోకి వచ్చిన ఆరోపణలు కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కూత వేటు దూరంలోని ఓ గ్రామంలోనీ శివారు ప్రాంతంలో  ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ఓ పేద కుటుంబం కూలి పనుల కోసం ఆ గ్రామానికి రాగా, ఆ కుటుంబానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక పై ముగ్గురు యువకులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ అత్యాచారం లో ఓ ప్రధాన మీడియా ఛానల్ కు చెందిన రిపోర్టర్  ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కొంతమంది గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు నగదు ఇచ్చి వ్యవహారాన్ని పరిష్కరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఒక మైనర్ బాలికపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తీవ్రమైన నేరాన్ని గ్రామ పంచాయతీ స్థాయిలో డబ్బులతో ముగించే ప్రయత్నం జరిగిందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.బాలికకు న్యాయం జరగాల్సిన సమయంలో బాధిత కుటుంబంపై రాజీ ఒత్తిళ్లు వచ్చాయా? ఈ వ్యవహారంలో స్థానికంగా ఎవరెవరు జోక్యం చేసుకున్నారు? పోలీసులకు ముందుగానే సమాచారం అందిందా?

అందితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. బాలిక కుటుంబం పై ఒత్తిడి చేసి ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు అది కేవలం గ్రామస్థాయి పంచాయతీతో పరిష్కరించగలిగే వ్యవహారం కాదు.

బాధితురాలి రక్షణ, వైద్య సహాయం, న్యాయపరమైన విచారణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. డబ్బులతో కేసును ముగించే ప్రయత్నం జరిగిందన్న ఆరోపణలు నిజమైతే వాటిపైనా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది.జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ ఘటనపై తక్షణమే స్పందించి, బాధిత బాలికకు రక్షణ కల్పించడంతో పాటు, ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంఘాలు, ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.

ఈ విషయమై విజయక్రాంతి బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య ను వివరణ కోరగా బీర్కూర్ ఎస్సై  విచారణ చేపడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు బాధితురాలు నుండి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. నా దృష్టికి రాలేదు, పిర్యాదు వస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, గ్రామస్థాయి రాజీ ప్రయత్నాల వెనుక ఉన్న వ్యక్తుల పాత్రను కూడా పరిశీలిస్తామని సీఐ తిరుపతయ్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు