బాలికపై అఘాయిత్యం.. తెరవెనుక ‘మౌన ఒప్పందాలు’...?
బీర్కూర్ మండల ఘటనపై ఇంటెలిజెన్స్ ఆరా
బాధిత కుటుంబానికి బెదిరింపుల ఆరోపణలు
ముడుపుల ప్రచారంతో కలకలం
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బీర్కూర్ మండల పరిధిలో మైనర్ బాలిక(Minor Girl)పై అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. తాజాగా ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ అధికారులు గ్రామంతో పాటు మండలంలో విస్తృతంగా విచారణ చేపడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఓ మైనర్ బాధిత కుటుంబం ఎవరైనా ఒత్తిళ్లకు గురైందా? ఘటనను బయటపెట్టకుండా ఉండేందుకు ఎవరైనా ప్రయత్నించారా? కుటుంబాన్ని భయపెట్టిన వ్యక్తులు ఎవరు? వారికి వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసేందుకు భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు(Financial Transactions) జరిగాయా? జరిగితే ఎవరి మధ్య జరిగాయి? ఈ వ్యవహారంలో మధ్యవర్తుల పాత్ర ఏమైనా ఉందా? అన్న కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలు, కుటుంబంపై ఒత్తిళ్లు, వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తుల పాత్రపై ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారనీ సమాచారం. అయితే విచారణ అధికారికంగా ఏ అంశాలపై కొనసాగుతోంది? ఎవరెవరి వాంగ్మూలాలు తీసుకున్నారు? ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఏమిటి? అన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది.