ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిజం కీలకం
ప్రజాస్వామ్యాన్ని కాపాడేది జర్నలిజమే
జాతీయ జర్నలిజం దినోత్సవ వేడుకలో డబ్ల్యూజేఐ నేతలు
30 యేళ్ళ పాటు పని చేసిన యూనియన్ నేతలకు సన్మానం
ఖమ్మం టౌన్,(విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేది జర్నలిజమేనని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) నేతలు అన్నారు. జాతీయ జర్నలిజం దినోత్సవాన్ని పురష్కరించుకొని ఖమ్మంలోని ఎన్నెస్పీ రామాలయం ఫంక్షన్ హాల్లో డబ్ల్యూజేఐ జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్ ఆధ్వర్యంలో సభ్యులకు తేనేటి విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జర్నలిజంలో 30 యేళ్ళ పాటు పని చేసిన సీనియర్ జర్నలిస్టులు ఎన్.ఎస్.రావు, కట్టెకోల చిన నరసయ్య, యెన్నెబోయిన శ్రీనివాస రావు, జాబిశెట్టి కుటుంబ రావు, ఎం.ఏ అన్సార్ పాషా, సెఫీ యు జమ, గోగుల నారాయణ రావు, గంటెల ఆనంద్, ఏనిగండ్ల శ్రీనివాస రావులను ఘనంగా సన్మానించారు. అనంతరం యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారా సుబ్రమణ్యేశ్వర రావు (ఎన్.ఎస్.రావు) మాట్లాడుతూ జర్నలిస్టులు నిజాయితీ, సమగ్రత, తటస్థత, చట్టబద్ధత మరియు ప్రజలకు జవాబుదారీతనం వంటి సూత్రాలను పాటించి పని చేయాలని ఉద్భోధించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు కనీస వేతనాలు దక్కేల చర్యలు చేపట్టాలని కోరారు. అనేక రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్లు ఇస్తున్నారని, తెలంగాణలో కూడా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, దశాబ్ధాల తరబడి అపరిష్కృతంగా వున్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
డబ్ల్యూజేఐ ఖమ్మం జిల్లా కోకన్వీనర్ యెన్నెబోయిన శ్రీనివాస రావు మాట్లాడుతూ నేడు జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతూ ఈ వృత్తిలో కొనసాగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలతో పాటు నాయకులు బొడ్డుపల్లి రవీందర్, పసుపులేటి ఉపేందర్, శ్రీనివాస చారి, వుల్లోజీ హరీష్ తదితరులు పాల్గొన్నారు.