అర్హులందరికీ చేయూత పింఛన్ల భరోసా

18-11-2026 | 11:39am

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెల్లడి

మండలాలు, మున్సిపాలిటీల వారీగా కొత్త పింఛన్ల వివరాలు ప్రకటన

ఇందిరమ్మ జీవిత బీమాతో పాటు 50 వేల మంది మహిళలకు చీరల పంపిణీ

షాద్ నగర్,(విజయక్రాంతి): పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్(Shadnagar MLA Veerlapalli Shankar) స్పష్టం చేశారు. నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల(Cheyutha Pensions)తో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికుల కుటుంబాల నుంచి పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 98 శాతం మంది అర్హులకు పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని ఫరూక్‌నగర్ మండలంలో 970, షాద్‌నగర్ పట్టణంలో 760, కేశంపేట మండలంలో 716, నందిగామ మండలంలో 545, చౌదరిగూడెం మండలంలో 540, కొందుర్గు మండలంలో 497, కొత్తూరు మండలంలో 368, కొత్తూరు మున్సిపాలిటీలో 119 పింఛన్లు మంజూరైనట్లు వివరించారు. అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందించడం ద్వారా ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత(Financial security) కల్పించేందుకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వీర్లపల్లి శంకర్ తెలిపారు. కుటుంబ పెద్ద అకాల మరణం చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా అందించే ఈ పథకం పేదలకు ఎంతో భరోసానిస్తుందని పేర్కొన్నారు. దీనికి తోడు నియోజకవర్గంలోని పేద కుటుంబాలకు చెందిన మహిళలకు సుమారు 45 వేల నుంచి 50 వేల వరకు చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. పేదల సంక్షేమం, మహిళల ఆర్థిక భద్రత, సామాజిక న్యాయానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని వీర్లపల్లి శంకర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ ఛైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు