జపాన్లో ఆధునిక వ్యవసాయ విధానాలపై జిల్లా కలెక్టర్ అధ్యయనం
వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై పరిశీలన
వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు అనుసరిస్తున్న పద్ధతుల పరిశీలన
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ అంకిత్ జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి వ్యవసాయ క్షేత్రాలను(Agricultural fields) సందర్శించి ఆధునిక వ్యవసాయ విధానాలు, సాగులో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల సాగు నుంచి నిర్వహణ వరకు వివిధ దశల్లో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్న విధానం, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు అనుసరిస్తున్న పద్ధతులపై అవగాహన పొందారు.
జపాన్(Japan)లో వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న వినూత్న విధానాలు, యాంత్రీకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకుంటున్న తీరు, పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ అధిక దిగుబడులు సాధిస్తున్న విధానాలను కలెక్టర్ అధ్యయనం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాల నిర్వహణ, సాగు ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమయం, శ్రమ ఆదా చేస్తూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్న విధానాలను పరిశీలించారు.
జపాన్ పర్యటనలో గుర్తించిన ఉత్తమ వ్యవసాయ విధానాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, స్థానిక పంటల సాగు తీరు, రైతుల అవసరాలకు అనుగుణంగా అన్వయించే అవకాశాలను పరిశీలించనున్నారు. తద్వారా జిల్లాలో వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేయడంతో పాటు, రైతులకు ప్రయోజనం చేకూర్చే వినూత్న సాగు విధానాలను ప్రోత్సహించేందుకు ఈ అధ్యయనం దోహదపడనుంది.