అక్షర పిడుగు దాశరథి

02-11-2026 | 05:10am

సినిమా కవిత్వాన్ని, సంప్రదాయ కవిత్వాన్ని తెలుగు సాహితీ మాగాణంలో(The Fertile Expanse of Telugu Literature) జోడెడ్లుగా సమంగా కదం తొక్కించి సాహితీ సేద్యం చేసిన గొప్ప కలికుడు (కలం కారుడు), హాలికుడు.. మహాకవి దాశరథి కృష్ణమాచార్య. సుమారు 80 ఏళ్ల నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన బాటలు వేశారు. ‘నా తెలంగాణ కోటి రతణాల వీణ’ అని ఎలుగెత్తి అక్షర రణ నినాదం చేశారు.

విను వీధుల్లో తెలంగాణ సమర పతాకాన్ని పాతి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిమంతుడయ్యారు. ఇదే క్రమంలో తెలుగు భారతికి ముద్దుల పుత్రుడిగా, సకలాం ధ్ర కవిగా, ప్రపంచానా ప్రథమ శ్రేణినలంకరించిన మహాకవిగా ప్రసిద్ధికెక్కారు. 1925 జూలై 22న మహబూబా బాద్ జిల్లా (ఉమ్మడి వరంగల్) చిన్న గూడూరులో సనాతన సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో వెంకటమ్మ, వెం కటాచార్య దంపతులకు జ్యేష్ఠ పుత్రుడిగా దాశరథి కృష్ణమాచార్య జన్మించారు.

ఈయన తర్వాత ప్రముఖ కవి, పండితుడు దాశరథి రంగాచార్య జన్మించారు. తండ్రి వెంకటాచార్య గొప్ప కవి, పండితుడు. తల్లి వెంకటమ్మ గొప్ప హరికథ భాగవతారిని. దాశరథి ఉర్దూలో మెట్రిక్యులేషన్(పదవ తరగతి), భోపాల్ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడి యట్, ఉస్మానియా విశ్వద్యాలయంలో బి.ఏ. (ఇంగ్లిషు) చదివారు.

తెలుగు, ఉర్దూల్లో మంచి పండితుడైనప్పటికీ సంస్కృతం, ఆంగ్లంలో కూడా మంచి పట్టు ను సాధించారు. తండ్రి స్ఫూర్తితో చిన్నప్పుడే వ్యాకరణ సహిత చందోబద్ధ పద్య కవిత్వం రాశారు. ఆయన ఆధునిక భావాలు, ప్రజా పక్షాన నిలిచి అక్షర గర్జన చేసే నిర్భయ, నిర్మోహమాట గంభీర వర్తిమంతుడు కావడం చేత నిజాం నవాబు అరాచక, అవినీతి, అక్రమ పాలనను సహించ లేక పోయారు. ఈ నేపథ్యంలో నిజాం జాగిర్దారీ నిరంకుశ విధానాలను ప్రతిఘటించడానికి గార్లలో గొప్ప ప్రజా ఉద్యమాన్ని ప్రభంజనంగా నడిపారు.

1947లో హైదరాబాద్‌లో నిజాం వ్యతిరేక ప్రజా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని నిజాంకు సింహ స్వప్నమైనందున.. దాశరథిని వరంగల్, నిజామాబాద్, హైద రాబాద్ చంచల్‌గూడ జైళ్లలో వేశారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ జైలులో ఉండగా పళ్లు తోముకోడానికి ఇచ్చిన బొగ్గును కలంగా చేసుకొని ఓనిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని!, మా నిజాం రాజు తరతరాల బూజు..

ముసలి నక్కకు రాచరికమా? అంటూ ఎద్దేవా చేస్తూ ప్రశ్నిస్తూ జైలు గోడలపై అక్షర పిడుగులు రాలుస్తూ, రణ నినాదాలతో నిజాం నిరంకుశ పాలనను నిలదీశారు. నాతెలంగాణా కోటి రతణాల వీణ అంటూ ఎలుగెత్తి చాటారు. ఈ అక్షర తిరుగుబాటుకు ఆయన ఘోరమైన చిత్రహింసలు అనుభవించారు. ఈ క్రమంలో నిజాం పోలీసులకు పట్టుబడకుండా చాలాకాలం అజ్ఞాత జీవితం గడిపారు.

హైదరాబాద్ సంస్థానా నికి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చాక  జైలు నుంచి విడుదలైన అనంతరం.. దాశరథి తొలుత ఉపాధ్యాయుడు. అనంతరం పంచాయతీ ఇన్స్‌పెక్టర్‌గా, ఆకా శవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేశారు. నిజాం వ్యతిరేక ఉద్యమం నడిపి జైలు పాలైనా,  వివిధ ఉద్యోగాలు చేసి నా ఆయన కవితా ప్రవృత్తిని మాత్రం మరువ లేదు. పైగా కవిగా లబ్దప్రతిష్ఠులుగా పేరుగాంచారు. కథలు, నవలలు, నాటికలు, పద్యకావ్యాలు, గేయాలు, కవితలు, గజల్స్.. ఇలా సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో గొప్ప రచనలు చేశారు.

సినీ గేయ రచనలపై మక్కువ

నిజాం నిరంకుశ పాలనపై అక్షర పిడుగులు కురిపించిన దాశరథికి ఈ క్రమంలోనే సినీ గేయ రచనలపై మక్కువ కలిగింది. ఆయన ప్రతిభ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగేశ్వర్‌రావు దృష్టిలో పడింది. తెలంగాణా మరో మహాకవి సి.నారాయణరెడ్డి అగ్రహీరో ఎన్టీఆర్ దృష్టిలో పడి ‘గులేబకావళి’ చిత్రంలో పూర్తి పాటలు రాసి ప్రసిద్ధుడు కాగా..

ఏఎన్‌ఆర్ సిఫార్సుతో ఆత్రేయ ‘వాగ్దానం’ చిత్రంలో దాశరథికి అవకాశం కల్పించారు. ఈ చిత్రంలో ఆయన రాసిన ‘నాకంటి పాపలో నిలిచి పోరా!’ గీతం సినీ వినీలాకాశంలో ఆయనకు గుర్తింపు తెచ్చింది. అనంతరం అక్కినేని తన సొంత చిత్రం ‘ఇద్దరు మిత్రులు’లో అవకాశం ఇవ్వగా ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’ పాట రాసి హిట్ కొట్టి సినీ గేయ రచయితగా ఉన్నత శిఖరాలకు చేరారు.

అప్పటి వరకు తెలుగు సినీ గేయ రచ నల్లో ఆంధ్ర రచయితల ఆధిపత్యం ఉండగా.. తెలంగాణ నుంచి దాశరథి కృష్ణమాచార్య, సినారె ప్రవేశం సరికొత్త విప్లవాన్ని తెచ్చింది. వారిద్దరూ సుదీర్ఘకాలం తమ ఆదిపత్యం కొనసాగించి సినీ సంగీత ప్రపంచంలోనూ రారా జులుగా వెలుగొందారు. దాశరథికి ఏఎన్‌ఆర్, ఎన్టీఆర్ చిత్రాలకు వరుసగా పాటలు రాసే అవకాశాలు రావడంతో తారాపథానికి దూసుకుకెళ్లారు. ముఖ్యంగా ఏఎ. ఆర్ చిత్రాలకు ఆయన రాసిన గీతాలు ఎంతో పాప్‌లర్ అయ్యాయి.

ఈ క్రమంలో మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లనూ తెలుగులోకి గాలిబ్ గీతాల పేర అనువాదం చేసి ఏఎన్‌ఆర్‌కు అంఖితం చేశారు. ఇందులో ఒక గీతాన్ని ఏఎన్‌ఆర్ వివిధ సభల్లో చెప్పేవారు. నరుడు నరుడవుట ఎంతో దుష్కరమ్ము సుమ్ము! ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము!  పాటను ఆయన ఎంతో ఇష్టపడే వారు. సినిమా పాటల రచయితల్లో దాశరథి, ఆత్రేయ గొప్పతనాన్ని ఏఎన్‌ఆర్ ఎంతగానో కీర్తించారు.   

2 వేలకు పైగా సినిమా పాటలు

శృంగారం, ప్రేమ, భక్తి, హాస్యం, వేదాంతం, జాతీయత, మానవత మేళవించిన ఆణిముత్యాల్లాంటి ఎన్నో సినిమా పాటలు రాసి తెలుగు సినిమా ప్రేక్షకులను ఓలలాడించారు దాశరథి కృష్ణమాచార్యులు. 1978 వరకు వందలాది సినిమాలకు 2వేలకు పైగా పాటలు రాశాడు. ముఖ్యంగా వీణ పాటల స్పెషలిస్టుగా దాశరథి పేరుగాంచారు.

ఆయన రాసిన  పాటల్లో ముఖ్యంగా ఇద్దరు మి త్రులు సినిమాలో ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ’, నాదీ ఆడజన్మే చిత్రంలో ‘కన్నయ్యా నల్లని కన్నయ్యా’, రాములో ‘రారా కృష్ణయ్యా’, మావదినలో ‘మా ఇలవేల్పు నీవేనయ్యా’, దాగుడు మూతలు సినిమాలో ‘గోరొంక గూటి కే చేరావు చిలకా’ అనే పాటలు ఎంతో ప్రాచుర్యం పొం దాయి.

అలాగే గూడు పుఠాని చిత్రంలో ‘తనివి తీరలేదే’,  మానవుడు -దానవుడులో ‘అమ్మాలాంటి చల్లనిది’, రంగులరాట్నంలో ‘నడిరేయి ఏజాములో’, జమీందారు గారి అమ్మాయిలో ‘మ్రోగింది వీణ’, అందమే ఆనందంలో ‘మధు మాస వేళలో’, కన్నె వయసులో ‘ఏదివి లో విరిసిన పారిజాతమో’, ఆడపడుచులో ‘అన్నా నీఅనురాగం’, మూగమనసులు చిత్రంలో ‘గోదారి గట్టుంది’ పాటలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి.

ఎన్టీఆర్ నటించిన ఆరాధన సినిమాలో ‘నీకేలా ఇంత నిరా శా’, ఇద్దరమ్మాయిలులో ‘ఈచల్లని లోగిలిలో’, మంచి మనసులులో ‘నన్ను వదిలి నీవు పోలేవులే’, అమర శిల్పి జక్కన్నలో ‘వసంత సేన’, లేత మనసులు తదితర మరెన్నో చిత్రాల్లో ఆణిముత్యాల్లాంటి వందలాది పాట లు రాశారు. సినీ గీతాలే కాదు.. ప్రైవేట్ గేయాల్లోనూ తనదైన ముద్ర వేశారు దాశరథి. ‘ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడ బాలనమెంతో’ ప్రైవేటు పాట నేటికీ సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. కాలం మారినా ఆ పాట మాదుర్యం మాత్రం తగ్గలేదు.

అక్షర సంపదకు అపురూప గౌరవం

అగ్నిధార, రుద్రవీణ, మహాబోధి, నాగార్జున చరిత్ర, పునర్నవం, మహేంద్రోదయం, మహాశిల్పి జక్కన్న(నవల), కవితా పుష్పకం, దాశరథి శతకం, అమృతాభిషేకం, నవమంజరి, బలిగేయాలు, గాలిబ్ గీతాలు, ఏకశిల, ఇం కా పలు కవితా సంపుటాలను వెలువరించారు దాశరథి కృష్ణమాచార్య.‘కవితా పుష్పకం’ కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు.

నిజాం వ్యతిరేక ప్రజా స్వాతంత్య్రోద్యమం నడిపినందుకు గాను అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1972లో తామ్రపత్రం ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. 1981లో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ఇచ్చింది. ఇంకా రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీల బహుమతులు అందుకున్నారు. 1977 ఆగస్టు 15 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా గొప్ప గౌరవం పొందారు.

ఈయన అనంతరం మరొకరు ఆస్థాన కవిగా నియమింపబడలేదు. మడమ తిప్పని, రాజీపడని స్వాతంత్య్రోద్యమ పోరాట పఠిమ, అకుంఠిత దేశభక్తికి మారుపేరు, మహోన్నతమైన మహాకవిగా పేరుగాంచిన దాశరిథ.. తన జీవిత ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదురైనా వాటిని అధిగమించి సాహిత్య శిఖరాగ్రానికి చేరారు. 1987 నవంబర్ 5న తన 62 ఏళ్ల వయసులో మహాభినిష్ర్కమణ(అమరు డయ్యాడు) చెందారు. జోహార్.. దాశరథీ కష్ణమాచార్యా!


మరిన్ని వార్తలు