డ్రాపౌట్లకు చెక్ పడేనా?

18-11-2026 | 05:05am

సంపతి రమేష్ :

నేటి విద్యా వ్యవస్థలో(Education System) పోటీతత్వం విద్యార్థుల భవిష్యత్తును(The Future of Students) శాసిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల ఒత్తిడి పెరుగుతుంది. ఇంటర్మీడియట్‌కు(Intermediate) వచ్చేసరికి ఆర్థిక భారం, చదువు ఒత్తిడి పెరిగి డ్రాపౌట్లు అధికమవుతున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్య, ఇంటర్ విద్యకు మధ్య సరైన అనుసంధానం లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ లోక్‌సభ(Parliament Lok Sabha) అంచనాల కమిటీ-2026 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఒకటో తరగతిలో చేరిన విద్యార్థుల్లో దాదాపు 73 శాతం మంది హయ్యర్ సెకండరీ (ఇంటర్మీడియట్) పూర్తి కాకముందే వివిధ దశల్లో చదువు మానేస్తున్నారు.

నీతి ఆయోగ్(NITI Aayog)-2026 నివేదిక ప్రకారం.. తెలంగాణలో 10వ తరగతి నుంచి ఇంటర్‌లోకి ప్రవేశించే విద్యార్థుల రేటు 72.8శాతం మాత్రమే ఉంది. మిగిలిన 27.2శాతం మంది విద్యార్థులు తదుపరి విద్యాస్థాయికి వెళ్లడం లేదు. ఇందులో బాలికలు, గ్రామీణ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యతో ఇంటర్మీడియట్ విద్యను సమీకృతం చేయాలనే నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

మెజార్టీ రాష్ట్రాల్లో బడిలోనే ఇంటర్     

దేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పరిధిలో 9, 10 తరగతులను సెకండరీ విద్యగా, 11, 12 తరగతులను సీనియర్ సెకండరీ విద్యగా పరిగణిస్తారు. విద్యార్థులు పదో తరగతి తర్వాత వేరే జూనియర్ కళాశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అదే పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యను కొనసాగించే అవకాశం ఉంటుంది. దీంతో ఆ పాఠశాలలో డ్రాపౌవుట్ రేట్ తక్కువ ఉన్నది. మెజార్టీ రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ విద్య పాఠశాలలోనే కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితరులు రాష్ట్రాల్లో మాత్రమే ఇంటర్ విద్య ప్రత్యేకంగా కొనసాగుతుంది. జూనియర్ కళాశాలలు దూరంగా ఉండటం వల్ల రవాణా ఖర్చులు, బాలికల భద్రత సమస్యలు, ఆర్థిక భారం చదువుకు ఆటంకంగా మారుతున్నాయి. ఫలితంగా కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువును మానేస్తున్నారు. జాతీయ విద్యా విధానం---2020 సంప్రదాయ 10+2 విద్యా విధానానికి బదులుగా 5+3+3+4 నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులో 3 నుంచి 8 సంవత్సరాల వయసు వరకు ఫౌండేషనల్, 8 నుంచి 11 ఏళ్ల వరకు ప్రిపరేటరీ, 11నుంచి14 ఏళ్ల వరకు మిడిల్, 14 నుంచి 18 ఏళ్ల వరకు సెకండరీ దశగా విభజించారు. సెకండరీ దశలో 9 నుంచి 12 తరగతులను నాలుగేళ్ల సెకండరీ విద్యగా పరిగణించడం ద్వారా విద్యార్థులకు విస్తృతమైన విషయ పరిజ్ఞానం, సబ్జెక్టుల ఎంపిక స్వేచ్ఛ, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

విద్యా రంగంలో కొత్త మలుపు

తెలంగాణలో ఇప్పటివరకు పదో తరగతి వరకు పాఠశాల విద్య, ఆ తర్వాత ఇంటర్మీడియట్ విద్యను ప్రత్యేక జూనియర్ కళాశాలల ద్వారా అందిస్తున్నారు. ఈ రెండు విభాగాలను సమీకృతం చేస్తూ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే గొడుకు కిందకు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం (2027---28) నుంచి ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా నిర్మాణంలో నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక విద్యగా, ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు సెకండరీ విద్యగా, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విద్యగా విభజించనున్నారు. అంటే ప్రస్తుతం జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ 11, 12 తరగతులను పాఠశాల విద్యాలోకి తీసుకురానున్నారు. ఈ నిర్ణయం ద్వారా విద్యా వ్యవస్థలో పరిపాలనా సమన్వయం పెరగడంతో పాటు విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గుతాయని ఆశిస్తున్నారు. సమీకృత విద్యా విధానాన్ని తెలంగాణ విద్యా కమిషన్ కూడా ప్రతిపాదించింది. ఆకునూరి మురళి నేతృత్వంలోని కమిషన్ నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను ఒకే ప్రాంగణంలో అందించే విధంగా ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ నమూనాను ఇప్పటికే సూచించింది.

కార్పొరేట్ దోపిడీ ఆగేనా?

ప్రస్తుతం విద్యావ్యవస్థలో కార్పొరేట్ యాజమాన్యాల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఐఐటీ, నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షల పేరుతో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నాయి. తల్లిదండ్రుల్లోనూ తమ పిల్లలు ఉన్నత ర్యాంకులు సాధించాలనే ఆశలను పెంచుతూ విద్యను ఒక వ్యాపార వస్తువుగా మార్చుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్యకు వచ్చేసరికి ఈ వ్యాపార ధోరణి మరింత తీవ్రమవుతోం ది. లక్షల రూపాయల ఫీజులు, ప్రత్యేక కోచింగ్, హాస్టల్ ఖర్చులు, ర్యాంకుల కోసం ఒత్తిడి.. విద్యార్థులను మానసికంగా కుంగదీస్తున్నాయి. అంతేకాదు.. ఆర్థిక స్థోమత లేని పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ పోటీ వ్యవస్థలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా అట్టడుగు బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యతో విలీనం చేయడం వల్ల కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందా? అనేదే అసలు ప్రశ్న. తెలంగాణలో మెజార్టీ ప్రైవేట్ ఇంటర్మీడియట్ విద్యాసంస్థల నిర్వహణ, యాజమాన్యం అగ్రవర్ణ ఆధిపత్యంలోనే ఉందనే విమర్శలున్నాయి. ప్రభుత్వాలు కూడా ఈ విద్యా వ్యాపార విస్తరణకు అవకాశం కల్పించాయనే ఆరోపణలున్నాయి. కాబట్టి ప్రభుత్వం నూతన నిబంధనల అమలులో నిక్కచ్చిగా, పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులపై కఠి న నియంత్రణ విధించినప్పుడే విద్యా దో పిడీకి అడ్డుకట్ట పడుతుంది. లేనిపక్షం లో కార్పొరేట్ విద్యా వ్యాపారం యథా తథంగా కొనసాగుతుంది. మరి తెలంగాణ ప్రభుత్వం చేపట్ట బోయే నూతన మార్పు లు కార్పొరేట్ విద్యా దోపిడీకి ముగింపు పలుకుతుందా? లేక కేవలం పరిపాలనా పు నర్వ్యవస్థీకరణగానే మిగిలిపోతుందా? చూడాలి.

 వ్యాసకర్త: సామాజిక విశ్లేషకులు

సెల్: 7989579428

మరిన్ని వార్తలు