రోహిత్ వేముల బిల్లు .. వివక్షకు తెరపడేనా?
విశ్వవిద్యాలయం(University) అంటే పట్టాలు పంచే కేంద్రం కాదు. ప్రశ్నించే స్వేచ్ఛకు, సమాన అవకాశాలకు, సామాజిక మార్పుకు నిలయమైన ప్రజాస్వామిక వేదిక. అక్కడ విద్యార్థులను ప్రతిభతో గుర్తించాలే తప్ప.. కులం, మతం, భాష, ఆర్థిక స్థితి చూసి అవమానించకూడదు. కానీ, ఉన్నత విద్యాసంస్థల్లో(Educational Institutions) వివక్ష, ఒంటరితనం, వేధింపులు, అవకాశాల నిరాకరణ వంటి ఫిర్యాదులు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు-2026’ ప్రాధాన్యం సంతరించుకుంది.
ముసాయిదాను మూడు నెలల్లో సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ నెల 16న అధికారులను ఆదేశించా రు. ముసాయిదా, మంత్రివర్గం, అసెంబ్లీల్లో ఆమోదం, అమలు వేర్వే రు దశలు. శిక్షలు, పరిధి, విచారణ విధానం ఇంకా ఖరారు కాలేదు.
రోహిత్ వేముల 2016 జనవరి 17న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా ఉండగా మరణించారు. ఆ మరణం దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలకు, క్యాంపస్లలో కుల వివక్షపై చర్చకు దారితీసింది. ఆ ఘటన చుట్టూ ఉన్న కొన్ని వాస్తవాలు, ఆయన సామాజిక నేపథ్యంపై వచ్చిన అధికారిక వ్యాఖ్యలు ఇప్పటికీ వివాదాస్పదమే. అందుకే ఎవరినీ ముందుగానే దోషిగా నిర్ణయించకుండా అసలు ప్రశ్న అడగాలి.. సంక్షోభంలో ఉన్న విద్యార్థికి వ్యవస్థ న్యాయమైన విచారణనూ, గౌరవాన్నీ, సమర్థమైన సహాయాన్నీ ఇవ్వగలిగిందా? ఇప్పటికే చట్టాలు లేవా అనే ప్రశ్న సహజం.
రాజ్యాంగంలోని 14వ అధికరణం చట్టం ముం దు సమానత్వాన్ని, చట్టాల సమాన రక్షణను ఇస్తుంది. 15వ అధికరణం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. 15వ అధికరణంలోని ఐదో క్లాజు విద్యా సంస్థల్లో ప్రత్యేక ఏర్పాట్లకు అవకాశం ఇస్తుంది. 17వ అధికరణం అంటరానితనాన్ని రద్దు చేస్తుంది. 46వ అధికరణం ఎస్సీ, ఎస్టీల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యతను ప్రభుత్వానికి అప్పగిస్తుంది.
ర్యాగింగ్ నిరోధక నిబంధనలు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, విశ్వవిద్యాలయ మంజూరు సంఘం నిబంధనలు కూడా ఉన్నాయి. కానీ హక్కు ఉండటం వేరు, అది అందడం వేరు. ఫిర్యాదు ఎవరికి చేయాలి? ఆరోపణలు ఎదుర్కొనేవారే విచారణను ప్రభావితం చేయకుండా ఎలా చూడాలి? ఫిర్యాదు చేసినందుకు వసతిగృహం, పరిశోధన మార్గదర్శకత్వం, ఉపకార వేతనం కోల్పోకుండా ఎవరు కాపాడతారు? విచారణ ఎప్పటికి ముగుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం లేనప్పుడు చట్టాలున్నా విద్యార్థి ఒంటరిగానే మిగులుతాడు.
కొత్త చట్టం ఈ లోటును పూడ్చాలంటే వివక్షకు స్పష్టమైన నిర్వచ నం కావాలి. స్వతంత్ర ఫిర్యాదుల వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. ఫిర్యాదుదారులకు, సాక్షులకు రక్షణ కావాలి. గడువులతో కూడిన విచారణ, మధ్యంతర రక్షణ, పునర్విచారణ అవకాశం ఉండాలి. స్వచ్ఛందంగా పొందే మానసిక సహాయం, వ్యక్తిగత వివరాల గోప్యత కూడా అవసరం. ప్రభు త్వం ఇచ్చిన మూడు నెలల గడువు తొలి అడుగు మాత్రమే. అసలు పరీక్ష ముందుంది.
విద్యార్థుల గొంతు ఎంతవరకు వింటారు? స్వతంత్ర వ్యవస్థను నిజంగా నెలకొల్పుతారా? సిబ్బందికీ నిధులకూ కేటాయింపులు చేస్తారా? రోహిత్ వేముల పేరుకు అర్థం ఆ పేరులో లేదు, ఆ పేరు గుర్తుచేసే సమస్యకు శాశ్వత పరిష్కా రం వెతకడంలో ఉంది. ప్రతిభ కు కులం, ఫిర్యాదుకు భయం అడ్డు కాకూడదు, న్యాయానికి అధికారం అడ్డు కాకూడదు. ఈ బిల్లు చట్టపుస్తకంలో అక్షరాల సమాహారంగా మిగలకుండా, ప్రతి వి ద్యార్థీ గౌరవంగా చదువుకునే హక్కుకు ఆచరణాత్మక భరోసా కావాలి.
సీనియర్ జర్నలిస్ట్ (9010128884)