మహిళా శక్తి, ఆత్మగౌరవం, సాధికారతకు ప్రతీక స్త్రీ శక్తి దివస్
హనుమకొండ, నవంబర్ 19(విజయ క్రాంతి): భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళకు అత్యంత గౌరవప్రదమైన, విశిష్టమైన స్థానం ఉందని కెయు క్యాంపస్ వైస్ ప్రిన్సిపల్ మమత(KU Campus Vice-Principal Mamata) అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కె యు శాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్ అధ్యక్షతన స్త్రీ శక్తి దివస్ జువాలజీ సెమినార్ హాల్ లో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు,క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ డా.మమత హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళకు అత్యంత గౌరవప్రదమైన, విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు.
భారతీయ చరిత్రలో మహిళలు కేవలం కుటుంబ వ్యవస్థకే పరిమితం కాకుండా సమాజ నిర్మాణంలో, దేశ రక్షణలో, విద్యా రంగంలో, పరిపాలనలో మరియు సాంస్కృతిక వికాసంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ సందర్భంగా మాచర్ల రాంబాబు మాట్లాడుతూ,భారతదేశ చరిత్రలో రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్యాబాయి హోల్కర్ వంటి వీరనారీమణులు తమ ధైర్యసాహసాలతో, పరిపాలనా దక్షతతో, నాయకత్వ లక్షణాలతో దేశానికి ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు.
వారి జీవితాలు నేటి యువతులకు స్ఫూర్తిదాయకమని, మహిళలు తమలోని ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను గుర్తించి అన్ని రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. క్రీడలు, సైన్యం, రాజకీయాలు, పరిశోధన మరియు సామాజిక సేవ వంటి అనేక రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.
మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం, వారి ప్రతిభను ప్రోత్సహించడం, వారికి గౌరవం మరియు భద్రత కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలను గౌరవించే సంస్కృతి ప్రతి విద్యార్థిలో అలవడాలని, మహిళల పట్ల వివక్షకు తావులేకుండా సమానత్వ భావనతో ముందుకు సాగాలని అన్నారు.
విద్యార్థి దశ నుంచే యువతులు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ఉన్నత విద్యను అభ్యసిస్తూ సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇంచార్జీ నిమ్మల రాజేష్,అగపాటి రాజు కుమార్ ,సాయి కుమార్, వీక్షిత,సారిక, వర్షిత, నందు,వినోద్ తదితరులు పాల్గొన్నారు.