ఇంటర్ బోర్డు రద్దు ఆలోచనను విరమించుకోవాలి
కొత్తపల్లి, నవంబర్ 19(విజయక్రాంతి):ఇంటర్మీడియట్ బోర్డును(Board of Intermediate Education) రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించడాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం కేవలం కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చేదిగా ఉందని, దీనివల్ల చిన్న పాఠశాలలు, కళాశాలలు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్ బోర్డు రద్దు నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు స్థానికత అంశంలో తీరని నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. 9 నుండి 12వ తరగతి వరకు ఒకే విద్యాసంస్థకు అనుమతులు ఇస్తే, ఇతర ప్రాంతాల (ఆంధ్రా) విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లు పొంది, తెలంగాణలో పరీక్షలు రాసే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. 55 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంటర్ బోర్డు వ్యవస్థను ఏకపక్షంగా రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని, ముఖ్యమంత్రి ఈ తప్పుడు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్యా రంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బండారి శేఖర్ విమర్శించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇంటర్ విద్య కారణంగానే ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఉన్నత విద్యావంతులుగా, మేధావులుగా ఎదిగారని గుర్తుచేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించకుండా అఖిలపక్ష పార్టీలు, మేధావులు, లెక్చరర్లు, ఉపాధ్యాయ సంఘాలు మరియు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమగ్రంగా చర్చించాలని కోరారు.