పేదల సొంతింటి కల సాకారమే ప్రభుత్వ లక్ష్యం

19-11-2026 | 09:49pm

దామరచర్ల లో 150 ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

దామరచర్ల :నవంబర్ :19: పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ(People's Government) లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Battula Lakshma Reddy) అన్నారు. దామరచర్ల మండల కేంద్రంలో గురువారం 150 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, మహిళా సంఘాల బలోపేతం, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా, ప్రతి గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ, ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.స్వర్గీయ ఇందిరా గాంధీ దేశ సమగ్రత, సమైక్యత, పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న గొప్ప నాయకురాలని ఈ సందర్భంగా కొనియాడారు. ..

మహిళా సాధికారతకు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఆమె ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేణుక ,మాజీ సర్పంచ్ కిరణ్ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగు నాయక్ ,కాంగ్రెస్ నాయకులు  గాజుల శ్రీనివాస్, పి కోటిరెడ్డి ,స్కైలాబ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు