పూర్తి ఆధారాలతో వాస్తవాలను వెల్లడించిన ఎమ్మెల్యే
రాజకీయ ఆరోపణలకు ధీటుగా సమాధానం..
హనుమకొండ, నవంబర్ 17 (విజయక్రాంతి): కాజీపేట వైఎస్ఆర్ నగర్ భూములు, కాజీపేట చౌరస్తాలో నిర్మాణం చేపట్టిన భవనానికి సంబంధించిన అంశాలపై ఇటీవల బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో పాటు కొన్ని హైదరాబాద్కు చెందిన యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ఆరోపణలపై వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) కాజీపేటలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి ఆధారాలతో స్పందించారు.
సమాచార హక్కు చట్టం ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన పత్రాలు, రెవెన్యూ రికార్డులు, భూముల వివరాలు, అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లను మీడియా ముందు ఉంచుతూ పలు కీలక అంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసుల సమస్యపై గతంలోనే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించానని, మరింత సమగ్ర సమాచారం కోసం మరోసారి దరఖాస్తు చేశానని తెలిపారు. రెవెన్యూ, కుడా, మున్సిపల్ కార్పొరేషన్ తదితర మూడు శాఖల నుంచి పూర్తి డాక్యుమెంటేషన్ సేకరించిన తర్వాతే ప్రజల ముందుకు వాస్తవాలు తీసుకువస్తానని స్పష్టం చేశారు.
తాను ఇప్పటివరకు ఏ అంశంపై మాట్లాడినా ఆధారాలు, అధికారిక రికార్డుల ఆధారంగానే మాట్లాడానని, ఊహాగానాలతో ఎప్పుడూ ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు. వైఎస్ఆర్ నగర్ భూములకు సంబంధించి ఇరానీ కుటుంబానికి చెందిన భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి రావడంతో అప్పట్లో కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఈ మేరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వివరించారు. ఈ కేసు న్యాయపరిధిలో ఉండగానే 2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో, సదరు భూములను నాలా కన్వర్షన్ చేసి ఇరానీ కుటుంబ సభ్యుల పేర్లపై ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు.
2018 వరకు సీలింగ్ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్న భూములు 2019లో ఏ విధంగా మార్పులకు గురయ్యాయో అధికారిక పహాణీలు, ఇతర రికార్డులతో సహా మీడియా ముందు ఉంచినట్లు తెలిపారు. ఈ భూముల వ్యవహారంలో గుడిసెవాసుల హక్కులకు సంబంధించి కూడా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాజీపేట చౌరస్తాలో నిర్మించిన భవనానికి 2017లో అప్పటి కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి రెసిడెన్షియల్ భూమిని కమర్షియల్ అవసరాలకు అనుగుణంగా ఎలా మార్చారని ప్రశ్నించారు.
టిఆర్ఎస్ హయాంలో వైయస్సార్ నగర్ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసి ఇప్పుడు దొంగలే దొంగలు అన్నట్టు మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, సెట్బ్యాక్లు, నిర్మాణ మార్పులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలపై కూడా పత్రాలను మీడియాకు చూపిస్తూ వివరించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ, కుడా, మున్సిపల్ కార్పొరేషన్ శాఖల రికార్డులను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
వైఎస్ఆర్ నగర్లో నివసిస్తున్న పేద ప్రజలను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని, ఏ ప్రభుత్వ శాఖ అధికారులు కూడా వారి జోలికి వెళ్లి అనవసరంగా భయాందోళనలకు గురిచేయకూడదని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడ 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. అక్కడ నివసిస్తున్న ప్రజల ప్రశాంతతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని, బయట వ్యక్తులు వచ్చి వివాదాలు సృష్టించకుండా చూడాలని అధికారులను కోరినట్లు వెల్లడించారు. కూడా భూముల వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని వరంగల్ బస్టాండ్, స్టేడియం అభివృద్ధి వంటి ప్రజాప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలనే ఆలోచనతో సంబంధిత అధికారులతో చర్చలు జరిపినట్లు తెలిపారు. అయితే ఈ అంశాన్ని కూడా తనపై రాజకీయ ఆరోపణలు చేసేందుకు ఉపయోగించుకున్నారని అన్నారు.
రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు ఎన్ని వచ్చినా తాను వాటికి భయపడేది లేదని, ప్రతి అంశానికి సంబంధించిన అధికారిక రికార్డులను సేకరించి ప్రజల ముందుంచుతానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తూ అసలు అంశాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ నగర్ భూములు, కాజీపేట చౌరస్తా భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆదారాలతో ప్రజల ముందు ఉంచుమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్,మాజీ కార్పొరేటర్లు జక్కుల రవీందర్,విజయశ్రీ రజాలి,తోట వెంకటేశ్వర్లు,పోతుల శ్రీమాన్,అబూబకర్,గుంటి కుమార్ సీనియర్ నాయకులు అంకుష్,సమత రాజు,పల్లకొండ సతీష్,డివిజన్ అధ్యక్షులు పాలడుగుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.