పెండింగ్ కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి

17-11-2026 | 07:38pm

కాటారం డిఎస్పి సూర్యనారాయణ

మహదేవ్‌పూర్, నవంబర్ 17 (విజయక్రాంతి): పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ(DSP Surya Narayana) సూచించారు. మంగళవారం మహదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా సందర్శించిన ఆయన వివిధ రికార్డులు, కేసు డైరీలు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ చర్యలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తి చేయడంతో పాటు స్టేషన్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణకు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, సైబర్ నేరాలు, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సూచించారు. ఆయన వెంట మహదేవ్‌పూర్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సాంబమూర్తి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు