ఓట్ల చోరీ అంటూ గగ్గోలు

17-11-2026 | 07:33pm
  1. SIRను వ్యతిరేకించడం వెనుక ఆంతర్యమేమిటి?
  2. దొంగ ఓట్లకు రక్షణ కల్పించాలనుకుంటున్నారా..?
  3. ఒక వ్యక్తికి ఒకే ఓటు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలి: మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
  4. భువనగిరిలో మేధావులతో సంగోష్టి.. ప్రతిపక్షాల వైఖరిపై ఎంపీ ఘాటు వ్యాఖ్యలు..

ఆలేరు, నవంబర్ 17 (విజయక్రాంతి): ఓట్ల చోరీ జరుగుతోందంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు.. మరోవైపు ఓటర్ల జాబితాలోని అక్రమాలను సరిదిద్దే ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(Voter list revision) (SIR) ప్రక్రియను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని మెదక్ లోక్‌సభ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ప్రశ్నించారు.

ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలని, అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు దక్కాలని, అర్హత లేని వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయడాన్ని వ్యతిరేకించడం ప్రజాస్వామ్య పరిరక్షణ ఎలా అవుతుందని నిలదీశారు.

మంగళవారం భువనగిరి పట్టణంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో 'ఎ డైలాగ్ విత్ ఎమినెంట్ సిటిజన్స్' (మేధావులతో సంగోష్టి) కార్యక్రమాన్ని వంగేటి విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఓటు హక్కు భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, దాని పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాలో ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండటం, మరణించిన వారి పేర్లు కొనసాగడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు సరిగా లేకపోవడం వంటి లోపాలను గుర్తించి సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఎంపీ వివరించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు ఉంటే వాటిని ఆధారాలతో బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

తెలంగాణలో కూడా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. SIR అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, దేశ ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఒకవైపు ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తూ, మరోవైపు ఓటర్ల జాబితాలోని లోపాలను సరిచేసే ప్రక్రియను వ్యతిరేకించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వ్యవస్థపై రాజకీయ ఆరోపణలు చేయడం కంటే ఆధారాలతో మాట్లాడాలని సూచించారు.

సుప్రీంకోర్టును సైతం తప్పుపడుతూ ప్రజల్లో అనుమానాలు: వేముల అశోక్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు SIR ప్రక్రియను, ఎన్నికల సంఘాన్ని మాత్రమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును సైతం తప్పుపడుతూ ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.

ఓటు హక్కు పవిత్రతను కాపాడాలి: ఊట్కూరి అశోక్ గౌడ్

జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు ఓటు హక్కు పవిత్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి, తుమ్మల మురళీధర్ రెడ్డి, మాయ దశరథ, శ్రీ వర్ధన్ రెడ్డి, పాశం భాస్కర్, పసుపునూరి నాగభూషణం,  యాదయ్య, మోగిళ్ల రాజిరెడ్డి, మహేష్, శేఖర్ యాదవ్, నరసింహ, దాసరి మల్లేశం, కర్నాటి ధనంజయ, పోతంశెట్టి రవీందర్, నర్ల నర్సింగరావు,

పడమటి జగన్మోహన్ రెడ్డి, చందా మహేందర్, కొప్పుల యాదిరెడ్డి, కాదూరి అచ్చయ్య, జైనపల్లి శ్యాంసుందర్, పట్నం శ్రీనివాస్, పొన్నాల చంద్రశేఖర్, గూడూరు నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ మోర్చాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు