మహిళలు ఆర్థికంగా ఎదిగి వ్యాపారవేత్తలుగా మారాలి
మహిళా సంఘాలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
హనుమకొండ, నవంబర్ 15(విజయక్రాంతి): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వ్యాపారవేత్తలుగా(Businesspeople) ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా సంఘాలకు(Women's groups) అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క(Danasari Anasuya Seethakka) అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా(Hanamkonda District) హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం(Gram Panchayat Office), మహిళా సమాఖ్య(వీవో) భవనాలను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు లతో కలిసి రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క ప్రారంభించారు.
అదేవిధంగా చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ పేదరికం లేని సమాజాన్ని చూడాలని, పేదరికంతో బాధపడకూడదు అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గరీబీ హఠావో నినాదంతో పేదరిక నిర్మూలనకు, నిరుపేదలకు ఇళ్లు, భూములు అందించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు.అదే స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇందిరమ్మ పేరుతో మహిళా శక్తిని బలోపేతం చేసే కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోందన్నారు.
మహిళలు సంతోషంగా, ఆర్థిక స్వావలంబనతో ఉన్నప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, తల్లి సంతోషంగా ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పేర్కొన్నారు. మహిళలు సంతోషంగా ఉండాలని సంకల్పంతో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, గత 3 సంవత్సరాల్లో బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాలకు సుమారు రూ.70 వేల కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు. ఒక్కో సంఘానికి రూ.10 లక్షల వరకు అందించే రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని, వడ్డీ మొత్తాన్ని తిరిగి మహిళల ఖాతాల్లో జమ చేస్తోందని చెప్పారు. గతంలో మహిళా సంఘాలు పొదుపు, కుటుంబ అవసరాలకే పరిమితమయ్యేవని, ప్రస్తుతం వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
మేడారం జాతర సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు సుమారు రూ.3 కోట్ల రుణాలు అందించి వ్యాపార అవకాశాలు కల్పించామని, కేవలం 10 రోజుల్లో వారు సుమారు రూ.6 కోట్ల లాభాలు ఆర్జించారని తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన సరస్ మేళాలో గ్రామీణ మహిళలు తయారుచేసిన వస్త్రాలు, అల్లికలు, బొమ్మలు, ఇతర ఉత్పత్తుల విక్రయాలకు అవకాశం కల్పించగా, 10 రోజుల్లో సుమారు రూ.10 కోట్ల సంపాదించారని వివరించారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచితంగా షాపులు కేటాయించారని పేర్కొన్నారు.
మహిళలు వివిధ రంగాల్లో వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి మత్స్యకార మహిళలకు మొబైల్ ఫిష్ అవుట్లెట్లు అందించి, శిక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. తన ములుగు నియోజకవర్గంలో గతంలో తలపై చేపల బుట్ట పెట్టుకుని విక్రయించిన మల్లమ్మ అనే మహిళకు వాహనం అందించి శిక్షణ ఇవ్వడంతో ప్రస్తుతం రోజుకు రూ.10వేల వరకు ఆదాయం పొందుతున్నారని ఉదాహరణగా వివరించారు. మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు బీమా సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ మండలంలో మరణించిన 7 మంది సభ్యులకు రూ. 56లక్షల రుణాలను మాఫీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన మహిళా సంఘం సభ్యురాలి కుటుంబానికి రూ.10 లక్షల ప్రమాద బీమా అందించినట్లు చెప్పారు. రుణం తీసుకున్న మహిళ మరణిస్తే ఆమె కుటుంబాన్ని బ్యాంకుల నుంచి రుణ వసూలు ఒత్తిడికి గురిచేయకుండా రుణ బీమా సదుపాయం కల్పించామని వివరించారు. మహిళలకు నచ్చే విధంగా చీరలను అందిస్తున్నామన్నారు.
మహిళా సంఘాలకు పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో నెలకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఏర్పడిందన్నారు. మండల సమఖ్యలకు బస్సులు కొనుగోలు చేసేందుకు రూ.30 లక్షల వరకు సహాయం, సబ్సిడీ కల్పిస్తున్నామని, ఒక్కో బస్సు ద్వారా నెలకు రూ.70 వేల వరకు మండల సమాఖ్య ఖాతాలో ఆదాయం జమ అవుతోందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా …