ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
ప్రజాదివాస్లో 10 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి టౌన్, నవంబర్ 09 (విజయక్రాంతి) : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(Jayashankar Bhupalpally District SP Sirisetti Sankeerth) తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో(District Police Headquarters) నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో(Praja Divas Program) జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 10 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలకు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదుల వివరాలను తెలియజేస్తూ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదులపై చట్టపరిధిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులను సంప్రదించి తమ సమస్యలను తెలియజేయాలని ఎస్పీ కోరారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాదివాస్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పోలీస్ సేవలు అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేర్కొన్నారు.