పేదలకు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించొద్దు
కొర్లకుంటలో ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని అడ్డుకున్న గ్రామస్తులు.
మహా ముత్తారం నవంబర్ 17 ( విజయ క్రాంతి): మహా ముత్తారం మండలంలోని కొర్లకుంటలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల (Government Upper Primary School) పక్కన ఉన్న ఖాళీ స్థలంలో చేపడుతున్న గ్రామపంచాయతీ, మహిళా సమైక్య భవణ(Women's Collective Building) నిర్మాణం కోసం తవ్వుతున్న పునాది పనులను గ్రామస్తులు పలువురు అడ్డుకున్నారు.
ఇది తమ ఇంటి స్థలాల కోసం కేటాయించిన భూమి అని ఇందులో ప్రభుత్వ భవనాలు నిర్మించడం సరికాదని, ఇందులో నిర్మాణం చేపట్టడానికి ఎవరు అనుమతులు ఇచ్చారో చెప్పారు అని డిమాండ్ చేశారు. తమకు సరైన ఇల్లు లేవని కొద్ది స్థలంలోనే రెండు మూడు కుటుంబాలు నివాసం ఉండే పరిస్థితి ఉందని ఇళ్ల స్థలం అంతా ప్రభుత్వ కార్యాలయాలకే సరిపోతే ఇక తమకు ఎలా స్థలాలు మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామపంచాయతీ నిర్మాణం కోసం గ్రామ కూడలిలో స్థలం ఉన్నప్పటికీ కావాలని పేదలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మహాముత్తారం ఎస్సై జి రమేష్ అక్కడికి చేరుకొని అడ్డుకున్న వారితో మాట్లాడారు. అభ్యంతరం ఉంటే తహసిల్దార్ కార్యాలయంలో, లేదా జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసి వారి నుంచి వివరణ పొందాలని కోరారు.
అధికారులతో మాట్లాడి తమ సమస్యను పరిష్కరించుకుంటామని గ్రామస్తులు చెప్పి వెళ్లిపోయారు. దీంతో పనులు నిలిపివేశారు. అడ్డుకున్న వారిలో బొల్లెడ్ల వెంకటయ్య, మేడిపల్లి పూర్ణచందర్, చేరాల రవీందర్, ముక్కెర నరసయ్య, పంతకాని దశరథం, బొబ్బిలి వినోద్, బి. మల్లయ్య, మహిళలు స్వర్ణ, మల్లక్క, సమ్మక్క, లక్ష్మి, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.