ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలి

17-11-2026 | 10:18pm

నల్లగొండ వ్యవసాయ శాఖ జేడీఏ వినోద్ కుమార్

మునుగోడు, నవంబర్ 17 (విజయక్రాంతి): రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ వినోద్ కుమార్(JDA Vinod Kumar) సూచించారు. మంగళవారం మండలంలోని పులిపలుపుల గ్రామ రైతు వేదికలో సంహిత రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన వేరుశనగ విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేసి మాట్లాడారు.

నీటి ఎద్దడిని తట్టుకుని మెరుగైన ఆదాయాన్ని అందించే వేరుశనగ వంటి నూనెగింజల పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందన్నారు. ఎల్‌నినో ప్రభావిత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు మెరుగైన దిగుబడులు సాధించవచ్చన్నారు.

పంటల ఎంపిక, విత్తనాలు, ఎరువుల యాజమాన్యం, చీడపీడల నివారణలో వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో చండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, ఏవో పద్మజ, సంహిత ఎఫ్‌పీవో చైర్మన్ జాజుల స్వామిగౌడ్, మార్కెట్ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, సర్పంచులు కంభంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు, నన్నూరి భూపతిరెడ్డి, అందుగుల నర్సమ్మ యాదయ్య, ఏఈవో నర్సింహ, సీఈవో రాంబాబు, రైతులు ఉన్నారు.

మరిన్ని వార్తలు