బాధిత కుటుంబాలకు రూ.30 లక్షలు ఇవ్వాల్సిందే!

09-11-2026 | 04:31pm

మహాదేవపూర్, నవంబర్ 9 (విజయక్రాంతి): ఇసుక లారీల ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.30 లక్షల పరిహారం అందించాలని మండల కులసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో పలు కులసంఘాల నాయకులు ఎంపీవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో ఇసుక రవాణా కోసం నిత్యం వందల సంఖ్యలో లారీలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. అధిక వేగంతో ఇసుక లారీలు ప్రయాణించడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు (Road Accidents) జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇసుక లారీల రాకపోకలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి నుంచి వెలువడే దుమ్ము, ధూళి (Dust Pollution) కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాపోయారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.30 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇసుక లారీల వేగాన్ని నియంత్రించి, రహదారి భద్రతా చర్యలు (Road Safety Measures) కట్టుదిట్టం చేయాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రం అందజేసిన వారిలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బెల్లంపల్లి సురేష్, ఆర్టీఐ సంఘం మండల ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామదాసు, నేతకాని మండల సంఘం అధ్యక్షుడు గోగుల నాగేందర్, ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ అమీన్, మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు చాగర్ల రాజు, దళిత సంఘ నాయకులు చింతకుంట్ల సతీష్, బీసీ నాయకులు అడపా లచ్చన్న, చింతకుంట్ల సాయి, కొలుగూరి సుమన్, లింగాల సుశాంత్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు