వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు
జొన్న, గోధుమ పంటలను పరిశీలించిన ఏఈఓ దతేశ్వరి
బాన్సువాడ, నవంబర్ 17 (విజయక్రాంతి): ఎల్నినో ప్రభావం నేపథ్యంలో భవిష్యత్తులో సాగునీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులు వరి పంటకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నామని రైతులు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని పోచారం, చిన్న రాంపూర్, ఇబ్రహీంపేట్ గ్రామ శివారుల్లో సాగు చేస్తున్న జొన్న, గోధుమ పంటలను వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) పి.దతేశ్వరి(AEO Dateshwari) రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటల ఎదుగుదల, సాగు విధానాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు నీటి వినియోగంపై అప్రమత్తంగా ఉంటూ వరికి బదులుగా జొన్న, గోధుమ వంటి ఆరుతడి పంటలను సాగు చేస్తున్నట్లు వివరించారు.
అనంతరం ఏఈఓ దతేశ్వరి మాట్లాడుతూ రబీ సీజన్లో సాగు చేసేందుకు అవసరమైన పంట విత్తనాలు, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు, కూరగాయల సాగుకు ఉపయోగించే పెండల్స్ అవసరమైన రైతులు తమ పేర్లను వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందే వ్యవసాయ వనరులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోచారం సర్పంచ్ కేతావత్ రమేష్, రాంపూర్ తాండ సర్పంచ్ కేతావత్ ఫకీర, గ్రామ పెద్ద బానోత్ హరిసింగ్ తదితర రైతులు పాల్గొన్నారు.