విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించని స్కూల్
- నాచారం సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ ఎదుట అయ్యప్ప స్వాముల ఆందోళన.. రంగంలోకి దిగిన పోలీసులు
- భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని లిఖితపూర్వక హామీ
ఉప్పల్ నవంబర్ 17 విజయక్రాంతి : అయ్యప్ప మాల(Ayyappa Mala) ధరించాడనే కారణంతో తొమ్మిదో తరగతి విద్యార్థిని తరగతి గదిలోకి అనుమతించకుండా లైబ్రరీలో, మరో గదిలో కూర్చోబెట్టిన ఘటన నాచారంలోని సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్‌లో(St. Peter's Model School) తీవ్ర వివాదానికి దారితీసింది. పాఠశాల యాజమాన్యం తీరుతో మనస్తాపానికి గురైన విద్యార్థి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు అయ్యప్ప స్వాముల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాఠశాల ఎదుటకు చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. అయ్యప్ప మాల ధరించడం వల్ల విద్యార్థికి తరగతి గదిలో ప్రవేశం నిరాకరించడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల ఇలాంటి వివక్ష చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే పాఠశాలలో గతంలోనూ రెండుసార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, అప్పట్లో వందలాది మంది అయ్యప్ప స్వాములు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టినప్పటికీ యాజమాన్యం వైఖరిలో మార్పు రాకపోవడంపై స్వాములు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సమాచారం అందుకున్న నాచారం పోలీసులు వెంటనే పాఠశాల వద్దకు చేరుకుని అయ్యప్ప స్వాములతో పాటు పాఠశాల యాజమాన్యంతో మాట్లాడారు. ఇరువర్గాల వాదనలు విన్న పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థి చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల యాజమాన్యానికి సూచించినట్లు తెలిసింది.
పోలీసుల జోక్యంతో పాఠశాల యాజమాన్యం దిగివచ్చి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చింది. దీంతో అయ్యప్ప స్వాములు తమ ఆందోళనను విరమించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా, వారి మనోభావాలను గౌరవిస్తూ పాఠశాల యాజమాన్యం వ్యవహరించాలని స్వాములు కోరారు.