హైవేపై వడ్లు ఆరబెడితే చర్యలు తప్పవు: ఎస్సై అనిల్
భిక్కనూర్, నవంబర్ 17 (విజయక్రాంతి): జాతీయ రహదారిపై వడ్లు పోసి వాహనాల రాకపోకలకు, రహదారి భద్రతకు ఆటంకం కలిగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని భిక్కనూర్ ఎస్సై అనిల్(Bhikkanoor SI Anil) హెచ్చరించారు. మండల పరిధిలోని జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా పోసిన వడ్లను పోలీసులు సీజ్ చేసి, రహదారిపై ఆటంకాలు తొలగించారు.
హైవేపై వడ్లు ఆరబెట్టడం వల్ల వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని ఎస్ఐ అనిల్ తెలిపారు. రైతులు హైవేలు, ప్రధాన రహదారులపై వడ్లు ఆరబెట్టకుండా ప్రత్యామ్నాయ ప్రదేశాలను వినియోగించుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.