పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైళ్లు
- ఐఆర్సీటీసీ ద్వారా తీర్థయాత్రలకు ప్యాకేజీలు
- ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- ఐఆర్ టి సి అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్
కామారెడ్డి, నవంబర్ 19(విజయక్రాంతి): దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు(Prominent Pilgrimage Sites), చారిత్రక ప్రదేశాలను సామాన్య ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్సీటీసీ టూరిజం(IRCTC Tourism) విభాగం ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను అందుబాటులోకి తేవడం జరిగిందని ఐఆర్టిసి అసిస్టెంట్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు.
గురువారం కామారెడ్డి రైల్వే స్టేషన్ విశ్రాంతి గది లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టూరిజం వివరాలు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా ప్రజలు టూరిజం రైల్వే ద్వారా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్', 'దేఖో అప్నా దేశ్' కార్యక్రమాల స్ఫూర్తితో రైలు, విమాన మార్గాల్లో దేశీయ, అంతర్జాతీయ పర్యాటక యాత్రలను నిర్వహిస్తోందన్నారు.
తెలంగాణ ప్రజల సౌకర్యార్థం కామారెడ్డి, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లో బోర్డింగ్ సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. అయోధ్య–కాశీ–వైద్యనాథ ధామ్ యాత్ర , సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా పూరీ చేరుకుంటారు.
అక్కడ జగన్నాథ స్వామి దర్శనం, కోణార్క్ సూర్య దేవాలయ సందర్శన అనంతరం వైద్యనాథ ధామ్, కాశీ విశ్వనాథ క్షేత్రం, గంగా హారతి, అయోధ్య, ప్రయాగరాజ్ ప్రాంతాలను సందర్శించేలా రైల్వే టూరిజం యాత్రను రూపొందించడం జరిగిందన్నారు.ముఖ్యమైన యాత్ర సప్త జ్యోతిర్లింగ దర్శనం.
సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్ ప్రాంతాల్లో ప్రయాణికులను ఎక్కించుకుంటుంది. ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, ద్వారకలో నాగేశ్వర్, సోమనాథ్, భీమాశంకర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకునేలా పది రోజుల యాత్ర రూపొందించడం జరిగిందన్నారు.
.సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలో కాజీపేట, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కవచ్చు అన్నారు. తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వర స్వామి దర్శనం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరువనంతపురం, తిరుచ్చి, తంజావూరు వంటి ప్రముఖ క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు అన్నారు.
ఈ ప్యాకేజీల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మూడు తరగతులను అందిస్తున్నామన్నా రు. ప్రయాణికులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించనున్నట్లు తెలిపారు. ప్రతి 35 మంది ప్రయాణికులకు ఒక టూర్ గైడ్‌ను నియమిస్తా మన్నారు. రవాణా, హోటల్ వసతి తరగతిని బట్టి మారుతుందన్నారు.
సెకండ్ ఏసీ ప్రయాణికులకు ఏసీ రవాణా, వసతి కల్పిస్తుండగా, మిగతా కేటగిరీల్లో కొన్ని సందర్భాల్లో నాన్ ఏసీ రవాణా ఉంటుందన్నారు.పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్సీటీసీ టూరిజం విభాగం మరో సదవకాశాన్ని కల్పిస్తోందన్నారు. ప్రత్యేక రైళ్లతో పాటు సాధారణ రైళ్లలో అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ప్రతి వారం పర్యాటక ప్యాకేజీలను నిర్వహిస్తుందన్నారు.
వేగవంతమైన ప్రయాణంతో పాటు సౌకర్యవంతమైన పర్యాటక అనుభూతిని కోరుకునే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం విభాగం దేశీయ, అంతర్జాతీయ విమాన ప్యాకేజీలను కూడా నిర్వహిస్తోందన్నారు.
కాశీ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు గ్రూప్ టూర్, కుటుంబ పర్యటనల రూపంలో ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తోందని వివరించారు. 29 మంది ప్రయాణికులతో గ్రూప్ టూర్లను నిర్వహించనున్నట్లు తెలిపారు. విమానాశ్రయంలో ప్రయాణికులను సమీకరించడం నుంచి తిరిగి చేరుకునే వరకు టూర్ మేనేజర్ పర్యవేక్షణ ఉంటుందన్నారు.
దేశీయ ప్యాకేజీలతో పాటు థాయ్‌లాండ్, శ్రీలంక, ఇండోనేషియా, పారిస్, యూరప్ తదితర అంతర్జాతీయ పర్యాటక ప్రాంతాలకు కూడా ప్యాకేజీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికుల భద్రత కోసం ప్యాకేజీల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ప్యాకేజీల ద్వారా లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్టీసీ) ప్రయోజనం పొందే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఆన్లైన్ బుకింగ్‌పై అవగాహన లేని వారు ఐఆర్సీటీసీ గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో అందుబాటులో ఉండే అధికారిక సంప్రదింపు వివరాల ద్వారా సంబంధిత సిబ్బందిని సంప్రదిస్తే, వాట్సాప్ ద్వారా వివరాలు సేకరించి చెల్లింపుల అనంతరం బుకింగ్ ప్రక్రియలో సహకరిస్తారు.
ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ www.irctctourism.com ద్వారా ప్యాకేజీల వివరాలు తెలుసుకోవడంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.