ప్రొబేషన్ ఉత్తర్వులు జారీ చేయాలి

19-11-2026 | 05:28pm

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): డీఎస్సీ–2024 ద్వారా నియామకమైన ఉపాధ్యాయుల ప్రొబేషన్ డిక్లరేషన్(Declaration of Probation for Teachers) ఉత్తర్వులు వెంటనే జారీ చేసి, రెండో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు చేయాలని ఎస్టీయూ టీఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బట్టారి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఓడిగే కృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రయ్యకు వినతిపత్రం అందజేశారు.

డీఎస్సీ–2024 ఉపాధ్యాయుల రెండేళ్ల ప్రొబేషనరీ సర్వీస్ గత అక్టోబర్ 9తో పూర్తయినప్పటికీ ఇప్పటివరకు డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ కాలేదని తెలిపారు. విద్యాశాఖ జాప్యం వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే ఒక నెల వార్షిక ఇంక్రిమెంట్ కోల్పోయారని, ఈ నెలలోనైనా మంజూరవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

గత డీఎస్సీల్లో లేని సమస్యలు 2024 డీఎస్సీ ఉపాధ్యాయులకు మాత్రమే ఎందుకు ఎదురవుతున్నాయని ప్రశ్నించారు. రెండేళ్ల సర్వీస్ పూర్తయిన వెంటనే రెండో వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు కావాల్సి ఉండగా, ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు లేవనే కారణంతో ఖజానా అధికారులు ఇంక్రిమెంట్లను నిలిపివేస్తున్నారని వివరించారు. అధికారులు వెంటనే స్పందించి ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు పెండింగ్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు