నిఘా నీడలో విధ్వంసం

15-11-2026 | 07:47pm

-జంగాపెళ్లి వరుణ్ శివాజీ

కరీంనగర్ క్రైం, విజయక్రాంతి: కాంక్రీట్ జంగల్ గా మారుతున్న కరీంనగర్ నగరానికి నడిబొడ్డున ఉన్న అతి చిన్న అడివి ఉన్న శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న అటవీ విధ్వంసానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ ఎఐఎస్ఎఫ్ కన్వీనర్ జంగాపెళ్లి వరుణ్ శివాజీ(AISF Convener Jangapelli Varun Shivaji) ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సింథటిక్ ట్రాక్ , స్పోర్ట్స్ గ్యాలరీ పేరిట జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఎనలేని అవినీతి జరుగుతున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు.

అభివృద్ధి కోసం కేటాయించిన కోట్లాది రూపాయలను సైడ్ ట్రాక్ పట్టించి, అక్రమంగా తవ్వి, వందల వేల ట్రాక్టర్ల మట్టిని అభివృద్ధి అని చెప్పే కార్యక్రమాలకు వాడుతున్నారని విమర్శించారు. ఆయా కార్యక్రమాలకు కేటాయించిన డబ్బును తమ జేబులోకి చేర్చుకునే కార్యక్రమం జరుగుతుందని ఆరోపించారు. శాతవాహన యూనివర్సిటీలో 300 కెమెరాల నిఘాలో ఉన్నాగాని అవినీతి జరుగుతుందనీ అన్నారు. వందలాది చెట్లు నరికి, కలపను బయటకి పంపించి, డబ్బును దోచుకున్న వ్యక్తులపై, దోచుకోవడానికి అనుమతినిచ్చిన వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

పెద్ద పెద్ద వృక్షాలు నెలగూల్చి తల్లి లాంటి అడవిని, మట్టిని తవ్వుకు తినేలా చేసి జాతీయ పక్షులు, వివిధ రకాలైన జంతువులు పారిపోయేలా వాటి నివాసాలను ధ్వంసం చేసిన, ధ్వంసం చేయడానికి అనుమతినిచ్చిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఆ విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో శాతవాహన యూనివర్సిటీ ఛాన్స్లర్ అయిన తెలంగాణ గవర్నర్ ని కలిసి విధ్వంసాన్ని, వినాశనాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు