కోదండ రామాలయంలో శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం
వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్ఠాపన..
భక్తులకు అన్నదానం చేసిన పబ్బ స్వరూపారాణి–రమేష్ గుప్తా, పబ్బ స్వాతి–మహేష్ గుప్తా కుటుంబ సభ్యులు
శివంపేట నవంబర్ 15 (విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని పురాతన శ్రీ కోదండ రామస్వామి దేవాలయం(Sri Kodanda Ramaswamy Temple)లో ఆదివారం శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజలు, సంప్రదాయ ధార్మిక కార్యక్రమాల మధ్య శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఉదయం నుంచే శివంపేటతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
సుమారు వెయ్యి మందికి అన్నదానం
ప్రతిష్ఠ మహోత్సవానికి విచ్చేసిన భక్తుల కోసం శివంపేట గ్రామ మాజీ సర్పంచ్ పబ్బ స్వరూపారాణి–రమేష్ గుప్తా, పబ్బ స్వాతి–మహేష్ గుప్తా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మందికి పైగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. భక్తిశ్రద్ధలతో అన్నదానం నిర్వహించి తమ సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ భక్తులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠ, అనంతరం అన్నదాన కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా ముగిసింది.