ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు
పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
చిగురు మామిడి,(విజయక్రాంతి): చిగురుమామిడి మండల కేంద్రంలో లోకిని స్వప్న-నరేష్ లో నూతన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని లోకిని స్వప్న దంపతులకు నూతన బట్టలు పెట్టీ స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. గత పదేళ్లుగా ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో, అర్హులైన పేదలను గుర్తించి విడతలవారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తున్నాన్నారు.
మొదటి విడతలో భాగంగా నియోజకవర్గంలోని 173 గ్రామాలకు సమాన ప్రాతిపదికన 3,500 ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేశామని, రెండవ విడతలో మరో 2,000 ఇండ్లు మంజూరు కానున్నాయని, ఇందులో గుడిసెలను పక్కా ఇల్లుగా మార్చడానికి 500, సగంలో నిలిచిపోయిన ఇండ్లను పూర్తి చేసుకోవడానికి 500, కొత్తగా ఇండ్లు నిర్మించుకునేందుకు మరో 1,000 ఇండ్లను అన్ని గ్రామాలకు సమానంగా కేటాయించడం జరిగిందన్నారు.
ఈ నెల 21న చిగురుమామిడిలో అలింకో ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశామని, ఈ శిబిరంలో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు శ్రవణ యంత్రాలు, వీల్చైర్లు, చేతికర్రలు, కృత్రిమ అవయవాలు ఉచితంగా అందజేస్తామన్నారు. త్వరలోనే గౌరవెల్లి నుంచి సాగునీరు రాబోతుందని.. నియోజకవర్గంలో వ్యవసాయానికి నీటి కొరత లేకుండా చూస్తామని, నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులను సైతం త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.