వర్సిటీ అరణ్య రోదన

13-11-2026 | 05:00am
  1. వర్సిటీలో విచ్చలవిడి కోతలు 
  2. అడ్డగోలు తవ్వకాలు 
  3. అడ్డుకుంటున్న విద్యార్థులు 
  4. అడ్డమొస్తున్న అధ్యాపకులు 

కరీంనగర్, నవంబర్ 12 (విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana University)లో చెట్ల నరికి వేత పై పర్యావరణ వేత్తలు, విద్యార్థులు ఆందోళనభాట పట్టారు. 200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశ్వవిద్యాలయంలో జాతీయ పక్షి నెమలి ఇక కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంఘటన ప్రజలు మరిచిపోక ముందే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న విచ్చలవిడి మట్టి, చెట్టు దోపిడి విద్యార్తిలోకాన్ని విస్మయానికి గురిచేస్తుంది.

శాతవాహన యూనివర్సిటీ అధికారులు విద్యార్థులను హాజరు పేరుతో దిగ్బంధనం చేస్తూ విచ్చలవిడి తవ్వకాలకు, అడ్డగోలు కోతలకు అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు రెండు వేల పచ్చటి చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా కోతలు చేశారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025 లో కేవలం 5 చెట్ల నరికివేతకు అటవీ శాఖ నుండి అనుమతులు తీసుకున్నట్టు విద్యార్థులు వెల్లడించారు. అయితే 5 చెట్లు కాస్తా 2 వేల చెట్ల వరకు నరకదం వెనక శాతవాహన యూనివర్సిటీ అధికారుల హస్తం ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

యూనివర్సిటీ అధికారులు సింథటిక్ ట్రాక్ కోసం దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చుతో టెండర్లు పిలిచినట్లు చెపుతున్న విద్యార్థులు, ఎందుకు కాంట్రాక్టర్ యూనివర్సిటీలో మట్టిని, చెట్లను ధ్వంసం చేస్తుంటే చూసుకుంటూ ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. కేవలం తమ స్వలాభం కోసం కొందరు ఉన్నతాధికారుల అండతో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న అధికారులను, కాంట్రాక్టర్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

భవిష్యత్తు తరాలకు అందాల్సిన ఫలాలను తమ స్వార్థం కోసం నాశనం చేసేలా వ్యవహరిస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, అవసరమైతే రిలే నిరహార దీక్షలతో మొదలుకొని, ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకడుగు వేసేది లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ తవ్వకాలకు, అడ్డగోలు కోతలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థులను ఒక విభాగం అధ్యాపకులు బెదిరింపులకు గురి చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది.

విద్యార్థులకు వ్యతిరేకంగా కొందరు అధికారులు చేస్తున్న తప్పుడు ఆరోపణలకు బదులిచ్చేందుకు అన్ని విభాగాల విద్యార్థులతో కలిసి యూనివర్సిటీలో  విద్యార్థి జేఏసీ తలపెట్టిన స్టూడెంట్ వాక్ కార్యక్రమానికి తరలి వెళుతున్న వారిని తిరిగి తరగతులకు తీసుకెళ్లడంలో అధికారులకు ఉన్న ఉత్సాహం ఏమిటని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. తమ యూనివర్సిటీ కోసం తామే స్వచ్ఛందంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత ఉన్న అధ్యాపకులు ఎవరి మెప్పు కోసం విద్యార్థులను అడ్డుకుంటున్నారని విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తున్నారు.  

సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..

యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, అడ్డగోలు చెట్ల నరికివేతపై సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. అక్రమాలపై నిజాని జాలు నిగ్గుతెల్చి, బాధ్యులను కఠినంగా శిక్షించాలి. భవిషత్తు తరాల కోసం పోరాడుతున్న విద్యార్థులకు అండగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యా లయాల నుండి మద్దతు వస్తుంది. వెంటనే తవ్వకాలు, చెట్ల నరికివేత ఆపకపోతే విద్యార్థులతో కలిసి రిలే నిరహార దీక్షలు, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు సైతం సిద్ధంగా ఉన్నాం. 

కరికే మహేశ్, శాతవాహన యూనివర్సిటీ 

జేఏసీ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు