కేసీఆర్ దీక్షా ఫలమే నేటి తెలంగాణ అభివృద్ధి

29-11-2026 | 07:06pm

కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో తెలంగాణకు జరిగింది అన్యాయమే

ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్

ఖమ్మం, నవంబర్ 29(విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గంలో(Palair Constituency) మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన 'దీక్షా దివస్' కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్(Thatha Madhusudhan) ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నవంబర్ 29న దీక్షా దివస్(Diksha Divas) జరుపుకోవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, చరిత్రను గుర్తుచేసుకోవడమేనని అన్నారు.

2009 నవంబర్ 29న కేసీఆర్(KCR) గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థులు, అమరవీరులపై కాల్పులు జరిపి వారి మరణాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉందని విమర్శించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉంటే ఇంతమంది బిడ్డల ఆత్మబలిదానాలు జరిగేవి కావని, ఉద్యమం అవసరమే ఉండేది కాదని గుర్తుచేశారు.

ఆనాడు ఆంధ్ర పాలకుల కుట్రలకు మద్దతుగా నిలిచి తెలంగాణ ఆకాంక్షలను తొక్కిపెట్టిన చరిత్ర కాంగ్రెస్‌దని ధ్వజమెత్తారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే పాలేరు నియోజకవర్గానికి భక్తరామదాసు ప్రాజెక్టు వచ్చిందని, నేడు పాలేరు ప్రజలు రెండు పూటలా మంచినీళ్లు తాగుతున్నారని తెలిపారు. గునుగు పుట్టే భూముల్లో రెండు పంటలు పండుతున్నాయన్నా, 24 గంటల ఉచిత కరెంటు అందుతుందన్నా, చెరువులు, బావులు నీటితో కళకళలాడుతున్నాయన్నా అది కేసీఆర్ కృషి వల్లే సాధ్యమైందని స్పష్టం చేశారు.

రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2,000 చేసిన ఘనత, ఎకరాకు రూ. 10,000 రైతుబంధు అందించిన ఘనత, కంటి వెలుగు ద్వారా అవ్వ తాతలకు కళ్లజోళ్లు ఇప్పించిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. పాలేరు ప్రజలకు కందాల ఉపేందర్ రెడ్డి గారు ఒక ధర్మరాజు లాంటి నాయకుడని, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అండగా నిలుస్తున్న ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందన్నారు.

రాబోయే ఎన్నికల్లో డీలిమిటేషన్ జరిగినా, జరగకపోయినా పాలేరు నుంచి ఉపేందర్ రెడ్డి గారే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని, ఆయన గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రతి గ్రామంలో కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్‌లా, ఒక కేటీఆర్‌లా పనిచేసి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని, కష్టకాలంలో గులాబీ జెండా మోసిన కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని తేల్చిచెప్పారు.

ఈ కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్, మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, ఉన్నం బ్రహ్మయ్య, భాషబోయిన వీరన్న, వేముల వీరయ్య మరియు ఉద్యమకారులు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు