తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేశారు

29-11-2026 | 07:00pm

కేసీఆర్ పోరాటం, పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది మాజీ ఎంపీ నామ

దీక్ష దివస్ కార్యక్రమంలో పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్న మాజీ ఎంపీ నామ

ఖమ్మం, నవంబర్ 29(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్(KCR) చేసిన పోరాటం, త్యాగాలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు(Nama Nageswara Rao) అన్నారు. నవంబర్ 29న దీక్ష దివస్(Deeksha Divas) సందర్భంగా ఖమ్మం తెలంగాణ భవన్‌లో(Khammam Telangana Bhavan) నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Former Minister Puvvada Ajay Kumar), రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తాతా మధుసూదన్ తో కలసి పాల్గొన్న నామ మాట్లాడుతూ.. 2009 నవంబర్ 29న తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న అన్యాయాలను ఇక భరించలేక ప్రాణత్యాగానికైనా సిద్ధమై దీక్ష చేపట్టారని పేర్కొన్నారు. కేసీఆర్ దీక్ష సమయంలో పార్లమెంట్‌లో(Parliament) జరిగిన పరిణామాలను నామ వివరించారు. అప్పట్లో తాను మరో పార్టీ నుంచి ఎంపీగా ఉన్నప్పటికీ తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దీక్షకు మద్దతుగా పార్లమెంట్‌లో గళమెత్తానని తెలిపారు. పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వివరించి, ఆయనకు మద్దతుగా మాట్లాడాలని వివిధ పార్టీల నేతలను కోరినట్లు చెప్పారు.

సుష్మా స్వరాజ్, అజిత్ సింగ్, ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్ తదితర నేతల మద్దతుతో పార్లమెంట్‌లో కేసీఆర్ దీక్ష అంశం చర్చకు వచ్చిందన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వెలువడినప్పటికీ, ఆంధ్ర ప్రాంత నేతల ఒత్తిళ్లతో వెనక్కి తగ్గడంతో ఉద్యమం మరికొన్నేళ్లు కొనసాగాల్సి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే సమయంలోనూ అనేక అడ్డంకులు ఎదురయ్యాయని నామ తెలిపారు.

బిల్లు ఆమోదం కోసం కేసీఆర్ స్వయంగా ఎంపీలతో సమన్వయం చేశారని, తాను కూడా వివిధ పార్టీల నేతలతో మాట్లాడి సహకారం కోరినట్లు వివరించారు. పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే ఘటనతో పాటు అనేక అవరోధాలు ఎదురైనా తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందన్నారు. పార్లమెంట్‌కు కేసీఆర్ వచ్చిన ప్రతిసారీ జై తెలంగాణ నినాదంతో రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించేవారని, ఆయన పోరాట పటిమను దగ్గరుండి చూశానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన పదవులను, వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కనపెట్టి పోరాడారని నామ కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు రాత్రింబవళ్లు శ్రమించి అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. అలాంటి నాయకుడిపై నేడు ఇష్టానుసారంగా విమర్శలు చేయడం బాధాకరమని, తెలంగాణ సాధనకు కారణమైన కేసీఆర్‌ను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.

మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ మొదటి నుంచీ మద్దతుగా ఉందని, అయితే నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని కేసీఆర్ స్పష్టం చేశారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి నష్టం కలగకూడదని, రాష్ట్రాల హక్కుల కోసం సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నామ పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు పేరుపేరునా అభివందనాలు తెలిపారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇప్పటి నుంచే రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కూరాకుల నాగభూషణం, ఖమర్, పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, ఉప్పల వెంకటరమణ, వీరునాయక్,గుత్తా రవి, హరిప్రసాద్, రామారావు, ఉద్యమకారులు బొమ్మెర రామ్మూర్తి, సుబ్బారావు, జేఏసీ నాయకులు తిరుమలరావు, నగర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు