శాంతినగర్ పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తా
పాఠశాల శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి
ఖమ్మం, నవంబర్ 29(విజయక్రాంతి): నిజాం కాలంలో(Nizam Era) 1927లో ఏర్పడి ఉర్దూ మీడియం బాలుర పాఠశాల(Urdu Medium Boys School) నుంచి.. తెలుగు, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం పాఠశాలగా(English medium school) కొనసాగుతూ.. ఖమ్మంలోని శాంతినగర్ పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఏర్పాటుచేసిన శతాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivasa Reddy) ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ఏడాదికాలంగా పూర్వ విద్యార్థులు, పూర్వ ఉపాధ్యాయులు ఎంతో సమిష్టిగా కృషిచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం పట్ల అభినందించారు. ఇక్కడి ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు.. త్వరలోనే 30 కంప్యూటర్లను అందించే ఏర్పాట్లు చేస్తానని ప్రకటించారు.
అలాగే మౌలిక వసతులు కల్పన కోసం జిల్లాకు చెందిన మరో ఇద్దరు మంత్రులతో కలిసి.. ఏర్పాట్లు చేయిస్తామని చెప్పారు. మంత్రి పొంగులేటి పాఠశాల అభివృద్ధి కోసం.. ఈ మేరకు ప్రకటించడంతో పూర్వ విద్యార్థులు, ప్రముఖులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.