ఐకమత్యంతో ముందుకు వెళ్దాం: ఎంపి రవిచంద్ర

15-11-2026 | 08:35pm

ఖమ్మంలో ఘనంగా మున్నూరు కాపు వన సమారాధన మహోత్సవం

ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): ఐకమత్యమే బలమని, ఐక్యంగా ముందుకు సాగితే పదవులు వాటంతటవే మన వద్దకు వస్తాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు, మున్నూరుకాపు సంఘం(Munnuru Kapu community) గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర(MP Vaddiraju Ravichandra) ఉద్బోధించారు. మనలో మనం కలహించుకుంటూ ముక్కలవుతే వచ్చే పదవులు కూడా రాకుండా పోతాయన్నారు.

పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యాన గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడి తోటలో ఆదివారం వన సమారాధన మహోత్సవం ఏర్పాటైంది. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ స్వాగతం పలికి సమన్వయకర్తగా వ్యవహరించగా, జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం అధ్యక్షత వహించారు.

మున్నూరుకాపు సమాజానికి విశేష సేవలందించిన దివంగత ప్రముఖులు పుంజాల శివశంకర్, మేకల సంగయ్య,రాపర్తి రంగారావు, మలిశెట్టి వరదయ్య, కనకం సత్యనారాయణల చిత్రపటాలకు రవిచంద్ర, గాంధీ,పారా నాగేశ్వరరావు, తోట రామారావు, వీరభద్రం, పొదిల రవికుమార్ తదితరులు పూలుజల్లి ఘనంగా నివాళులర్పించారు. వేల మంది మున్నూరుకాపు బాంధవులు హాజరైన ఈ మహోత్సవంలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, కులంలో పదవులు ఉంటేనే ఎమ్మెల్యేలు,ఎంపీలం అవుతామనుకోవడం ఒక భ్రమ మాత్రమేనన్నారు.

ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన వీ.హనుమంతరావు, గంగుల కమలాకర్,జోగు రామన్న, దాస్యం వినయ్ భాస్కర్, బాజిరెడ్డి గోవర్థన్ తదితరులు ఎమ్మెల్యేలు,మంత్రులు కాకముందు కులంలో ఎటువంటి పదవులు లేవన్నారు. సేవాభావం కలిగి కష్టపడుతూ పరిణితి, తపనతో పని చేస్తూపోవడమే త్యాగం తప్ప,ఆస్తులు కూడబెట్టుకుని ప్రజలను ఏ మాత్రం పట్టించుకోకపోవడం కాదని ఎంపీ రవిచంద్ర వ్యాఖ్యానించారు.

ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు వీ.హనుమంతరావు మాట్లాడుతూ, జనాభాలో గణనీయమైన సంఖ్యలో ఉన్న మున్నూరుకాపులపై కక్షగట్టి విడదీయాలనే ప్రయత్నాలు తగవన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ,మన జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపారని ఆవేదన వెలిబుచ్చారు. మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ, ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా మన ఐకమత్యాన్ని చాటిచెబుతూ రాజ్యాధికారం దిశగా అడుగులేద్దామన్నారు.

ఈ మహోత్సవంలో సంఘం ప్రముఖులు కొత్త సీతారాములు, పొదిల రవికుమార్, పసుపులేటి దేవేందర్, తాళ్లూరి హనుమంతరావు,జాబిశెట్టి శ్రీనివాసరావు,మడూరి పూర్ణచంద్రరావు,మెంతుల శ్రీశైలం,గీతా వెంకన్న, తోట రామారావు, పసుపులేటి నాసరయ్య, జీవీవీఎల్ నర్సింహారావు, ఆకుతోట ఆదినారాయణ, మేకల భిక్షమయ్య, డాక్టర్ తోట లక్ష్మణ్ కుమార్, డాక్టర్ పారా ఉష, డాక్టర్ గౌతమ్, డాక్టర్ తోట ప్రవీన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు