ఆపదలో ఆదుకున్న డీఎంహెచ్‌ఓ.. స్వయంగా రక్తదానం!
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సీడం నాగేంద్ర(DMHO Dr. Seedam Nagendra) నిరూపించారు. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన నాజియా బేగంకు అత్యవసరంగా ఏబీ పాజిటివ్ రక్తం(AB positive blood) అవసరమని రక్తదాతల గ్రూపులో సమాచారం అందించారు.
ఈ సందేశాన్ని గమనించిన డీఎంహెచ్‌ఓ నాగేంద్ర ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్వయంగా ముందుకు వచ్చి సోమవారం జీజీహెచ్ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో స్పందించి రక్తదానం చేయడం ద్వారా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. విధి నిర్వహణతో పాటు సామాజిక బాధ్యతను చాటుకున్న నాగేంద్ర సేవలను పలువురు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, నాగేంద్ర చూపిన చొరవ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.