పట్టీపట్టనట్టు!

05-11-2026 | 05:40am

ఉద్యోగుల పట్ల చులకనభావంలో సర్కార్

  1. ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై నిర్లక్ష్యం 
  2. డిమాండ్లు నెరవేర్చడంలో సాగదీతలు, వాయిదాలు
  3. ఉద్యోగుల్లో రోజురోజుకు పెరుగుతున్న అసహనం

నవంబర్ 4 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు, పెన్షనర్లను(Employees, teachers, RTC workers, pensioners) కాంగ్రెస్ ప్రభుత్వం చాలా లైట్ తీసుకుంటున్నదనే చర్చ ఉద్యోగ వర్గాల్లో జరుగుతోంది. ‘వీళ్ళతోటి ఏమైతదిలే? ఏమన్న అయ్యేదా? పొయ్యేదా? వీళ్లకు ఎంత చేసినా, ఏమిచ్చినా, మళ్లీ అడుగుతూనే ఉంటారు. అందుకే అడిగినప్పుడల్లా చేయడం కంటే.. చేయాల నుకున్నప్పుడే చేస్తే పోలా’ అనే భావనలో సర్కారు పెద్దలున్నారనే అభిప్రా యాలు వెల్లడవుతున్నాయి.

వాస్తవానికి ప్రభుత్వంలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకం. చట్టాలు, సంక్షేమ పథకాల అమ లు(Implementation of welfare schemes), క్షేత్రస్థాయిలో పరిపాలన బాధ్యతంతా వారిదే. అలాంటి వారి సమస్య లు, సంక్షేమాన్ని పట్టిం చుకోవాల్సింది ప్రభుత్వమే. లేదంటే ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అంతరం ఏర్పడుతుంది. ఉద్యోగుల్లో అసంతృప్తికి దారి తీస్తుంది.

అది ప్రభుత్వాలకు  మంచిది కాదనేది అధికారంలో ఉన్న పెద్దలకు తెలియనిది కాదు. ఆ ప్రభావం అప్పటికప్పుడు లేకపోయినా సమయం వచ్చినప్పుడు ఉద్యోగులంతా సంఘటితమై ప్రభుత్వ విధానాల్లోని లోపాలపై ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు. అది ప్రభుత్వంలో ఉండే ఏ పార్టీలకు శాపంగా మారే ప్రమాదానికి దారితీస్తుందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.  

ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమెక్కడ?

‘ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం మాది’ అని చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాల్లో రోజురోజుకు  అసంతృప్తి పెరుగుతోంది. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఉద్యోగుల వాట్సప్ గ్రూపుల్లో సర్కారు తీరుపై చక్కర్లుకొడుతున్న మెస్సేజ్‌లు చెప్పనక్కర్లేదు. సమస్యలు పరిష్కరించడం కంటే సాగదీత, వాయిదా వేయడానికే మొగ్గు చూపుతుండటంతో ఉద్యోగులు క్రమంగా ప్రభుత్వానికి దూరమవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో బీఆర్‌ఎస్ పదేళ్లు పాలించింది. ఉద్యమ పార్టీ కావడంతో అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందనే భావనతో ఉద్యోగులు ఆ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. కానీ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడంతో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఆ ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్‌ను ఉద్యోగ సంఘాల నేతలు కలవాలంటేనే అదో పెద్ద టాస్క్.

ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో కాస్త బెటరే అని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. సీఎంను, మంత్రులను కలుస్తున్నాము కానీ, తమ సమస్యలు ఇంకా చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయని జేఏసీ నేతలు చెప్తున్నారు. అదిగో ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తుండటంతో ఈ ప్రభుత్వంపై వారిలో అసంతృప్తి పెరిగిపోతుంది. అది కాస్త క్రమంగా ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, ఆర్టీసీ కార్మికులు, పెన్షనర్లు దూరమవుతున్నారు.

పరిష్కారం కంటే సాగతీతే ఎక్కువ..

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీ కార్మికులు, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, పెన్షనర్లందరూ కలిపి దాదాపు 14 లక్షల వరకు ఉంటారు. వీరి పెండింగ్ సమస్యలు అనేకం. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, పకడ్బందీగా హెల్త్ కార్డు అమలు, ఉద్యోగుల మెడికల్ బిల్లులు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయడం, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, 317 జీవో సమస్య, ఆర్టీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఎఫ్, సీసీఎస్ బకాయిలు, కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేయడం.

క్రమం తప్పకుండా ప్రతి నెలా వేతనం అమలు చేయడంలాంటి సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. పీఆర్సీ రిపోర్టును ఇప్పటి వరకు ప్రభుత్వం తెప్పించుకోనేలేదు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ జేఏసీ పోరాటం చేపడితే చర్చలు అని పిలిచి ప్రభుత్వం ఓ కమిటీని వేయడం లేదా మరోసారి భేటీ అవుదామని వాయిదా వేయడం జరుగుతోంది. పోరాటం చేయొద్దని అప్పటికప్పుడు సమస్యలు ప్రకటిస్తామని హామీ ఇవ్వడం, గడువు పెట్టడం సర్వసాధారణమైందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. 

మరిన్ని వార్తలు