జీహెచ్‌ఎంసీ జగమొండి!
నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతర్!
- జవహర్‌నగర్‌లో చెత్త డంప్ చేయొద్దన్నా వీడని నిర్లక్ష్యం
- ఇప్పటికీ కొనసాగుతున్న చెత్త తరలింపు
నవంబర్ 4 (విజయక్రాంతి): ఓట్లు వేసిన ప్రజలు నెత్తినోరు మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి వినిపించడం లేదు. ఆఖరికి కోర్టు చెప్పినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. జవహర్‌నగర్ డంప్ యార్డ్‌కు(Jawaharnagar Dump Yard) కొత్తగా చెత్తను తీసుకువెళ్లకూడదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(National Green Tribunal) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఉలుకూపలుకూ లేకుండా ఇప్పటికీ డంప్‌యార్డ్‌కు చెత్తను తరలిస్తూనే ఉన్నారని.. డంప్ యార్డ్ ఎత్తివేయాలంటూ పోరాటం చేస్తున్న ఐకాసల ప్రతినిధులు, పర్యావరణ నిపుణులు(Representatives of joint action committees, environmental experts) మండిపడుతున్నారు.
న్యాయ పోరాటం..
జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌ను ఎత్తివేయాలని, అక్కడికి చెత్తను తరలించడం నిలిపివేయాలని కోరుతూ దమ్మాయిగూడ జేఏసీ తరఫున శంకర్‌నారాయణ, బాలక్రిష్ణ తదితరులు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (సదరన్ జోన్)లో పిటిషన్‌ను దాఖలుచేశారు. ప్రతివాదులుగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ తదితరులను చేర్చారు. దీనిని 28.10.2025 నాడు విచారించారు. జస్టిస్ పుష్ప సత్యనారాయణ (జ్యుడీషియల్ మెంబర్), డాక్టర్ ప్రశాంతి గార్గవ (ఎక్స్‌పర్ట్ మెంబర్)లు ఈ పిటిషన్‌లో వాదనలు విని.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో కొత్తగా చెత్తను డంప్ చేయవద్దని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో చెత్త సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కోర్టు సూచనలతో అప్పటికే బాంబే ఐఐటీ అధ్యయనం చేసిందని, ఆ నివేదిక రావాల్సి ఉందని, అందుకోసం స్వల్ప కాలం వాయిదా వేయాలని జీహెచ్‌ఎంసీ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. దీనితో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి అంగీకరిస్తూ.. ఈ కేసును 10.11.2025 నాటికి తుది వాదనల కోసం వాయిదా వేసింది. అయితే కొత్తగా డంపింగ్‌యార్డ్‌లో చెత్తను, రిఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ (ఆర్‌డీఎఫ్)ను కూడా తీసుకురావద్దని, డంప్ చేయవద్దని, ఒకవేళ చెత్తను ప్రాసెసింగ్ చేసే సౌకర్యం ఉంటే.. ఇప్పటికే అక్కడ ఉన్న చెత్తను మాత్రం ప్రాసెసింగ్ చేయవచ్చని కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
అమలు శూన్యం..
అయితే చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంవత్సరం కాలం క్రితం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో.. ఇటు జీహెచ్‌ఎంసీ గానీ.. అటు ఓవరాల్‌గా ప్రభుత్వంగానీ ఒక్క అడుగుకూడా వేయలేదు. గడిచిన సంవత్సరం కాలంగా జీహెచ్‌ఎంసీ.. కొద్దికాలం క్రితం ఏర్పాటైన మల్కాజీగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ)లుకూడా వారి వారి పరిధిలోని చెత్తనంతా ప్రతిరోజూ తరలిస్తున్నారు. ఇలా దాదాపు ప్రతిరోజూ 10 వేల టన్నుల చెత్తను జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌కే పంపిస్తున్నారు.
అక్కడే గుట్టలుగా పోస్తున్నారు. నిజానికి చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత.. అటు జీహెచ్‌ఎంసీపై, మరోవంక ప్రభుత్వంపై ఉంది. ఇలా ఆదేశాలిచ్చి సంవత్సరం అవుతోంది. అయినా.. ఇప్పటికీ ఆ ఆదేశాలు కాగితాలపై మాత్రమే ఉంది. కానీ అమలు నోచుకోవడం లేదు. జవహర్‌నగర్‌కు చెత్త తరలింపు ఆగిపోలేదు.
పైగా రోజు రోజుకూ పెరుగుతోంది. ఇలా ప్రతిరోజూ జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌కు తీసుకొచ్చిన చెత్తను బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లతో చదును చేస్తూ.. కొత్త గుట్టలను సృష్టిస్తున్నారు. ఒకవంక కొత్తగా చెత్తను తీసు కురావద్దని, డంప్ చేయవద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ.. అటు జీహెచ్‌ఎంసీగానీ.. ఇటు ప్రభుత్వంగానీ పట్టించుకోవడం లేదు.
కోర్టు ఆదేశాలకే దిక్కులేకపోతే..
ఎప్పుడో సంవత్సరం క్రితం చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇకపై కొత్తగా చెత్తను జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో డంపింగ్ చేయవద్దని చెప్పింది. కోర్టు ఆదేశాలను ఇప్పటి వరకు అటు జీహెచ్‌ఎంసీ గానీ, ఇటు ప్రభుత్వం గానీ అమలు చేయడం లేదు. ప్రతిరోజూ ఇప్పటికీ.. మొత్తం చెత్తనంతా ఇక్కడికే తీసుకొస్తున్నారు. ఇక్కడే డంపింగ్ చేస్తున్నారు. పాత గుట్టల పక్కన కొత్తగా గుట్టలుగా చెత్తను పోస్తున్నారు. ప్రభుత్వం మా ఆవేదనను చెవిన ఎక్కించుకోవడం లేదు. మా బాధలను పరిష్కరించడం లేదు. కోర్టుకు వెళ్ళి పోరాటం చేసి సాధించినా.. కోర్టు ఆదేశాలనుకూడా పట్టించుకోవడం లేదు. అమలు చేయడం లేదు. ఇక మేము ఎవరికి చెప్పుకోవాలి.. ఎలా మా బాధలను, కష్టాలను తీర్చుకోవాలి. ఈ చెత్త తరలింపును ఎలా అడ్డుకోవాలి. ఈ చెత్త బాధలు ఎప్పుడు ఆగుతాయి.
మారం సమ్మిరెడ్డి, కో కన్వీనర్, దమ్మాయిగూడ జేఏసీ
చెత్త రీసైక్లింగ్‌పై విచారణ జరపాలి
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌లో చెత్త రీసైక్లింగ్‌పై విచారణ జరపాలి. విజయక్రాంతి దినపత్రికలో బుధవారం మొదటి పేజీలో ‘రీసైక్లింగ్ చెత్త!’ కథనం తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద పర్యావరణ, ఆర్థిక కుంభకోణాన్ని బయట పెట్టింది. దీనిపై మున్సిపల్ కౌన్సిల్ ఫోరం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. రోజుకు రూ.2.2 కోట్లు రాంకీ సంస్థ దోచుకుంటున్నది. ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. రీసైక్లింగ్ పేరుతో చెత్తను రీసైక్లింగ్ చేయకుండా, ప్రజల ప్రాణాలను, ప్రజాధనాన్ని ఎరిసైకిలింగ్ చేస్తున్న ఈ దండాను ప్రభుత్వం వెంటనే అరికట్టాలి. ప్రభుత్వం, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
భూక్య రాము నాయక్, చైర్మన్., మున్సిపల్ కౌన్సిల్ ఫోరం