అన్నదాతల్లో కొత్త ఆశలు!
ప్రాణహిత ప్రాజెక్టుపై మళ్లీ కదలిక..
- తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు
- మహారాష్ట్ర అనుమతులే కీలకం
- రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
కౌటాల, నవంబర్ 1౭ (విజయక్రాంతి): ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైన ప్రాణహిత ప్రాజెక్టుపై(Pranahita Project) మళ్లీ కదలిక మొదలైంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా(Kumuram Bheem Asifabad District) కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి(Tummidihetti) వద్ద ప్రాణహిత నదిపై(Pranhita River) బ్యారేజీ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కసరత్తు చేస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండటంతో ఈ ప్రాంత రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
బ్యారేజీ ఎత్తుపై కీలక చర్చలు
తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న బ్యారేజీ ఎత్తు ప్రస్తుతం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. గతంలో 148 మీటర్ల ఎత్తుకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఉండగా, మరింత నీటిని వినియోగించుకునే లక్ష్యంతో 152 మీటర్ల ఎత్తులో నిర్మించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో(Government of Maharashtra) చర్చలు జరుపుతోంది. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, ముంపు ప్రాంతాలు, సాంకేతిక అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
రెండు లక్షల ఎకరాలకు సాగునీరు
వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించే మార్గాలు, కాల్వలు, సొరంగాల నిర్మాణంపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే కౌటాల, సిర్పూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో వ్యవసాయానికి మేలు చేకూరనుంది. వర్షాధార సాగుపై ఆధారపడుతున్న రైతులకు సాగునీటి భరోసా లభించనుంది.
మహారాష్ట్ర అనుమతులే కీలకం
ప్రాణహిత నది తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తుండటంతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం అత్యంత అవసరం. ముఖ్యంగా బ్యారేజీ ఎత్తు పెంపుతో ఏర్పడే ముంపు ప్రభావం, నీటి వాటాలు, వినియోగం వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. అనుమతుల ప్రక్రియ పూర్తయితేనే ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమం కానుంది.
ప్రకటనలకే పరిమితమవుతుందా..
పనులు మొదలవుతాయా?
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై గతంలోనూ పలు ప్రభుత్వాలు ప్రతిపాదనలు చేసినప్పటికీ రైతుల సాగునీటి కల నేటికీ నెరవేరలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కసరత్తు ఆశలు రేకెత్తిస్తున్నా, ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎన్ని నిధులు కేటాయిస్తారు? భూసేకరణ, అనుమతుల ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుంది? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. చర్చలు, సర్వేలు, నివేదికలకే పరిమితం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగాలని రైతులు కోరుతున్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రాణహిత జలాలు తమ పొలాలకు చేరి పంటలు పండించే రోజు ఎప్పుడొస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.