డిసెంబర్ 15 నుంచి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు(ASHA workers) నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ప్రకటించారు. మంగళవారం జేఏసీ (AITUC-CITU-BRTU) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా బోగే ఉపేందర్, జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలకు నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.50 లక్షల బీమా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు, ప్రమోషన్లు కల్పించాలని కోరారు. డిసెంబర్ 15లోగా తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.